టీటీడీ భూములు విక్రయించరాదని తీర్మానం

టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం జరిగింది. చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా టీటీడీ ఆస్తులు విక్రయించకూడదని నిర్ణయించింది. నిరుపయోగ ఆస్తులు అన్యాక్రాంతమవకుండా ఉండేందుకు కమిటీని ఏర్పాటు చేసింది.

పాలక మండలి సమావేశంలో టీటీడీ భూములు విక్రయించరాదని తీర్మానం చేసినట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయానికి అనుణంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. టీటీడీ భూములు, ఆస్తులు ఎట్టి పరిస్థితిల్లో అమ్మేదిలేదని స్పష్టం చేశారు. టీటీడీ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామని అన్నారు. వీలైనంత త్వరగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తాం.. దర్శనానికి సంబంధించి నియమ, నిబంధనలు రూపొందిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.