ప్రజాసేవ చేసేందుకు దీనబంధు పోరాటం

 

ఏ పదవీ లేకుండా ఒట్టినే ప్రజాసేవ చేయడం ఎంత కష్టమో రాజ్యసభ సభ్యుడు టీ.సుబ్బిరామి రెడ్డిని అడిగితే చెపుతారు. వైజాగ్ లో ఉన్న అన్ని జాతులు, కులాలు, మతాలు, వర్గాల ప్రజలకు అడగకుండానే వరాలు కురిపిస్తున్న భోళా శంకరుడినని ఆయన శలవిస్తున్నారు. సినిమా రంగంలో ఉన్న మహామహులందరినీ పిలిచి వారిని సన్మానించి, కొన్ని బిరుదులు కూడా ప్రధానం చేసి, పనిలోపనిగా వారిచేత తన గొప్పదనం గురించి విశాఖ ప్రజలకు చెప్పించుకోవడం ఆయనకి అదో తుత్తి. విశాఖను ఏకంగా 40లక్షల మొక్కలతో పచ్చగా మార్చిపడేసానన్న ఆయన మాటలకు పచ్చకామెర్ల రోగులే సాక్ష్యం. మరిటువంటి గొప్పగొప్ప కార్యక్రమాలు చేస్తున్నందుకు దీన బంధు, కళాబందు వంటి బిరుదులు కూడా కొన్ని పుచ్చుకోక తప్పలేదాయనకి. అందువల్ల ప్రజలు కోరినా కోరకపోయినా వారికి మరింత సేవ చేయాలని తపించిపోతున్న రెడ్డిగారు. అందుకే వచ్చేఎన్నికలలో విశాఖ లోక్ సభ టికెట్ పుచ్చుకోవాలని డిసైడ్ అయిపోయారు.

 

సోనియమ్మకి తన సేవలు, బిరుదులు వగైరాల గురించి చెప్పుకొని, పనిలో పనిగా పురందేశ్వరికి టికెట్ ఈయవద్దని కూడా ఓ ఉచిత సలహా కూడా ఇచ్చి వచ్చానని ఆయనే స్వయంగా ప్రకటించుకొన్నారు.

 

సోనియమ్మ దగ్గర తన రేటింగ్ 100 నుండి ఒకేసారి 1000 శాతానికి పెరిగినందున, పురందేశ్వరిని నరసరావు పేటకు పొమ్మంటూ ఆయన ఒకటే పొగబెడుతుండటంతో, ఇక భరించలేక ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు రంగంలో దిగక తప్పలేదు. సుబ్బిరామి రెడ్డిని ఆయన నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణంలో కాంట్రాక్టరుగా చేస్తున్నపటి నుండి ఎరుగుదునని, అప్పుడు ఆయన డ్యాం కోసం వచ్చిన సిమెంటును బ్లాక్ మార్కెట్ లో అమ్ముకొంటున్నపుడు పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం, ఆ తరువాత కాలంలో విశాఖ స్టీల్ ప్లాంటులో ఆయన నొక్కుళ్ళు, హైవే రోడ్ల నిర్మాణంలో అడ్డుగోలు సంపాదనల గురించి తనకు తెలుసునని, ఆవిధంగా సంపాదించిన డబ్బుతో ప్రస్తుతం సినీ రంగంలో రిటైర్ అయిపోయిన వాళ్ళని, సినిమాలు లేక ఖాళీగా ఉన్నవారిని పిలిచి సన్మానాలు చేసి పొగిడించుకోవడం ఆయనకు హాబీ అని రెడ్డిగారి భూతవర్తమాన చరిత్రలు తవ్విపోసారు.

 

నిస్వార్ధంగా ప్రజాసేవలో నిమగ్నమయిన తనవంటి మహనీయులకి నీలాపనిందలు తప్పవని రెడ్డిగారికీ తెలుసు గనుక, దగ్గుబాటికి మతి భ్రమించిందని సర్టిఫై చేసేసి తనపై చేసిన ఆరోపణలను సింపుల్ గా దులిపేసుకొన్నారు. గులాం నబీ ఆజాద్ తో మాట్లాడి ఒప్పించి మరీ దగ్గుబాటి దంపతులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువస్తే, ఇప్పుడు తన గత చరిత్ర అంతా తవ్విపోయడం విశ్వాస ఘాతుకమేనని, ఇటువంటి వారికి పార్టీ టికెట్ ఈయదని, వైజాగ్ టికెట్ తనే పుచ్చుకోబోతున్నానని ఆయన బల్ల గుద్ది మరీ చెపుతున్నారు.

 

తనకు విశాఖ లోక్ సభ సీటు వస్తే అది వైజాగ్ ప్రజల అదృష్టం అని, తనకోసం ఇంతమంది ఆత్రంగా ఎదురు చూస్తునపుడు వారిని కాదనడం ఎలా?అంటూ రెడ్డిగారు ప్రశినిస్తున్నారు. మరి పార్టీ అధిష్టానం కూడా అలాగే కోరుకొంటోందో లేదో జాబితా విడుదల చేస్తే కానీ తెలియదు.