సిఎస్ ను కలవనున్న ఆర్టీసి కార్మికులు...

 

కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అనే సామెత వినే ఉంటారు. ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై ఈ విధంగానే కొనసాగుతుంది. పదమూడవ రోజు ఆర్టీసి కార్మిక సంఘాల సమ్మె కొనసాగుతోంది, రోజుకో తరహాలో కార్మికులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. చర్చల ద్వారా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చన్న  కోర్టు సూచనల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ప్రభుత్వం పిలిస్తే చర్చలకు సిద్ధమని కార్మిక సంఘాలు చెప్తున్నా చర్చలకు ససేమిరా అంటున్నారు తెలంగాణ సిఎం కెసిఆర్.

రేపు మరోమారు ఆర్టీసి కార్మికుల సమ్మెపై విచారణ చేపట్టబోతోంది హైకోర్టు. చర్చల సారాంశం ఏంటని ప్రశ్నించబోతోంది, చర్చల పురోగతిని కోర్టు ముందు ఉంచాలని కోర్టు గతంలోనే సూచించినా ఎలాంటి పురోగతి లభించలేదు. అయితే రేపటి విచారణలో ఇరువర్గాలూ ఎలాంటి వాదన వినిపించబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారింది. తమ వాదనను కోర్టుకు గట్టిగానే వినిపించాలని ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశారు సిఎం కెసిఆర్.

నిన్నటి సమావేశంలో ప్రభుత్వ ఉద్దేశాన్ని అధికారులకు వివరించారు సీఎం. మరోవైపు కాసేపట్లో సీఎస్ ను కలవబోతోంది ఉద్యోగ సంఘాల జెఎసి. తమ సమస్యలను  సియస్ దృష్టికి తీసుకొస్తూనే ఆర్.టి.సి కార్మికుల సమ్మెను ప్రత్యేకంగా ప్రస్తావించనుంది. మరోవైపు సీఎంతో భేటీ అయ్యారు ఎంపీ కేశవరావు. కెసిఆర్ ఆదేశిస్తే కార్మిక సంఘాలతో చర్చలకు సిద్ధమని గతంలో కేకే ప్రకటించిన నేపధ్యంలో ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరుగుతుందన్న అంశం ఆసక్తికరంగా ఉంది.