కోడెలను కాపాడుకోలేకపోయిన టీడీపీ.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

 

భవనం నిర్మించాలంటే నెలల సమయం పడుతుంది. కానీ కూల్చివేయాలంటే నిమిషాలు చాలు. అలాగే మనిషి మంచి పేరు సంపాదించాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది. కానీ ఆ పేరు పోవాలంటే కొన్ని క్షణాలు చాలు. తెలిసో తెలియకో కోడెల శివ ప్రసాద్ విషయంలో కూడా అలాగే జరిగింది. వైద్యుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో ఏళ్లు సేవ చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న ఆయన.. కొంతకాలంగా ఆరోపణలు, అవమానాలు చుట్టుముట్టడంతో.. తీవ్ర మనస్తాపానికి గురై.. ఆత్మహత్య చేసుకొని మరణించారు.

2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం, టీడీపీ ప్రతిపక్షానికి పరిమితం కావడంతో.. కోడెలకు కష్టాలు మొదలయ్యాయి. అధికార పార్టీ వైసీపీ కోడెలను బాగా టార్గెట్ చేసింది. ముఖ్యంగా అసెంబ్లీ ఫర్నీచర్ అంశాన్ని బాగా హైలైట్ చేసి కోడెల ప్రతిష్టను మసకబారేలా చేసింది. నిజంగా తప్పు చేసుంటే ఎంతవారినైనా శిక్షించాల్సిందే. కానీ కోడెల చేయని తప్పుకి ఎక్కువ అవమానాలు ఎదుర్కొన్నారని చెప్పక తప్పదు.

ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్స్ లో ఉండి, పదవీకాలం ముగిసి ఖాళీ చేసేటప్పుడు.. ఫర్నీచర్ అప్పజెప్పడం, పాడైన వాటికి ఖరీదు చెల్లించడం ఆనాయితీ. అసలు సరిగా అప్పజెప్పకపోవడం కూడా ఆనాయితీనే. అంతెందుకు కొత్త మంత్రులు, గవర్నర్లు, కొత్త సీఎంలు వచ్జ్చినప్పుడు కొత్త ఫర్నీచర్, ఇతర సామాగ్రి కొనడం.. పాతవి పక్కనెయ్యడం లేదా సిబ్బంది ఇళ్ళకు తరలిపోవడం కూడా ఆనవాయితీనే. కానీ కోడెల విషయంలో ఈ ఆనవాయితేనే అవినీతి అన్నారు.

అసెంబ్లీ, స్పీకర్ కార్యాలయం హైద్రాబాద్ నుండి అమరావతికి వచ్చినప్పుడు.. కొత్త భవనాలు ఫర్నీచర్ తో సహా అమర్చి ఇవ్వడంతో.. పాత ఫర్నీచర్ ను ఆయన తన క్యాంప్ ఆఫీసుల్లో అధికారులకు చెప్పి ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి అదేం కోట్ల విలువైన సొత్తు కాదు. రెండు మూడు లక్షల విలువైన పాత ఫర్నీచర్ మాత్రమే. అది కూడా కోడెల అప్పనంగా కొట్టేయాలి అనుకోలేదు. ఎందరో నాయకులు కోట్లు దోచుకున్నారు. కానీ కోడెల మాత్రం.. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ ఫర్నీచర్ తీసుకెళ్లండని బాధ్యతగా లేఖ రాసారు.

కొత్త స్పీకర్ జూన్ 12 లేదా 13 న ఛార్జ్ తీసుకొని ఉండొచ్చు. కానీ జూన్ 7 నే కోడెల పాత సామాగ్రి అప్పగిస్తాను లేదా వెల కట్టండి డబ్బులు చెల్లిస్తాను అని లేఖ రాసారు. కానీ అధికారుల నుంచి సమాధానం లేదు. దీంతో కోడెల మళ్ళీ ఆగస్ట్ 20 న మొదటి లేఖను ప్రస్తావిస్తూ మరో లేఖ రాసారు. అయినా సమాధానం లేదు. నిజానికి ఆ లేఖలకు స్పందించి ఫర్నీచర్ ని పట్టుకొని పోవచ్చు. కానీ ఉద్దేశ్య పూర్వకంగా రాద్దాంతం చేసి, కక్ష సాధింపు తరహాలో ఆగష్టు 24న కేసులు పెట్టి ఆయన్ని అవమానించారు. మరోవైపు అధికార పార్టీ నేతలు ఆయన మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా అంబటి రాంబాబు, విజయసాయి రెడ్డి వంటి వారు కోడెలపై దొంగ అనే ముద్ర వేశారు. విజయ సాయి రెడ్డి అయితే కోడెల దూడలు అంటూ వెటకారాలు చేస్తూ ట్విట్టర్ వేదికగా పదేపదే విమర్శలు గుప్పించారు. ఇలాంటి విమర్శలు కోడెలను బాగా కృంగదీశాయి. అసలు నా తప్పులేదు, నేను ముందే లేఖలు రాసాను.. కక్ష సాధింపుతో నా మీద నిందలు వేస్తున్నారని.. కోడెల పదేపదే ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అవివివేకం కానీ.. ఈ సోషల్ మీడియాలో యుగంలో ఆయన ఆవేదన ఎవరికి పడుతుంది?. 'ఫర్నీచర్ కోసం కోడెల కక్కుర్తి' అంటూ అటు మీడియా, సోషల్ మీడియాలో పదేపదే వార్తలు రావడంతో.. దానిలోని నిజానిజాలు తెలుసుకోకుండా అందరూ ఆయన మీద విమర్శలు గుప్పించారు. వీటిని కోడెల డిఫెండ్ చేసుకోలేకపోయారు. మరోవైపు పార్టీ నుండి కూడా ఆయనకు మద్దతు కరువైంది. ఆయనకు మద్దతిస్తే ఎక్కడ తమ మీద విమర్శలు వస్తాయనుకున్నారో ఏమో.. టీడీపీ నేతలు ఎవరూ మీడియా ముందుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కోడెలకు మద్దతుగా మాట్లాడలేదు.

ఒకవైపు అధికార పార్టీ నేతల విమర్శలు, వేధింపులు ఎక్కువవ్వడం.. మరోవైపు సొంత పార్టీ నేతల నుంచి మద్దతు కరువవ్వడంతో కోడెల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. తరువాత టీడీపీ నేతలకు వైసీపీ ప్రభుత్వం మీద ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ వేధింపుల వల్లే ఆయన మరణించారని టీడీపీ నేతలు జగన్ సర్కార్ మీద మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న కేసులు అడ్డుపెట్టుకొని కోడెలను తీవ్రంగా వేధించారని మండిపడ్డారు. ఇలాంటి మద్దతే కోడెల కోరుకున్నారు. కానీ పాపం ఆయన మరణించాక లభించింది. ఏమీలేని అంశంలో ఆయనను అంతలా ఇబ్బంది పెడుతుంటే.. ఒక్కడే ఎలా ఎదుర్కోవాలో తెలియక కోడెల మరణానికి తలవంచారు.

కోడెల విషయంలో టీడీపీ నేతలు చేసిన తప్పు.. మిగతా నేతల విషయంలో చేయవద్దని కార్యకర్తలు కోరుకుంటున్నారు. మిగతా నాయకులు కూడా ఇలా వేధింపులకు గురైతే.. ముందే వారికి అండగా నిలబడి, వారికి రక్షించుకోవాలని సూచిస్తున్నారు. మరి టీడీపీ నాయకులు, అధినాయకత్వం.. కోడెలలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైతే వారికి అండగా ఉండి వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారేమో చూడాలి. అంతేకాదు.. కోడెల మరణంతో టీడీపీకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైసీపీ మీద విరుచుకుపడింది. కేంద్రానికి, గవర్నర్ కి ఫిర్యాదు చేసింది. సీబీఐ ఎంక్వయిరీ కోరుతోంది. మరి ఈ పోరాటం టీడీపీ ఇలానే కొనసాగిస్తుందా?. అసలు కోడెల విషయంలో నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుందో చూడాలి. మొత్తానికి ఎలాంటి స్టెప్ తీసుకున్నా.. కార్యకర్తలు మాత్రం వేధింపులకు గురవుతున్న నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత అధిష్టానం మీదే ఉందని అంటున్నారు.