వరుస రోజుల్లో పాక్, భారత్ ప్రధానులతో భేటీ కానున్న ట్రంప్...

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో సోమవారం భేటీ కానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ మంగళవారం సమావేశం కానున్నారు. ఇందుకు న్యూయార్క్ వేదిక కానుంది. ఒక్క రోజు వ్యవధిలో పాక్, భారత్ ప్రధానులతో ట్రంప్ భేటీ అవుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా కశ్మీర్ అంశాన్ని అమెరికా అధ్యక్షుడు మరోమారు ప్రస్తావిస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.

మూడో దేశం జోక్యం అంగీకరించబోమని ఓ పక్క భారత్ చెబుతున్న ఇరువర్గాలకు ఆమోదం అయితేనే తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ట్రంప్ పదేపదే చెబుతున్నారు. మరో పక్క నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ భేటీ సందర్భంగా పలు ద్వైపాక్షిక రక్షణసంబంధ ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తో సమావేశం కానుండడం ఇది నాల్గోసారి.

వాణిజ్య, రక్షణ, విద్యుత్ కు సంబంధించిన అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఆదివారం హ్యూస్టన్ లో జరిగే హౌడీ మోదీ కార్యక్రమానికి హాజరై ట్రంప్ కీలక ప్రకటన చేయొచ్చన్న ప్రచారమూ జరుగుతోంది. ఇరుగు దేశాలకూ మధ్య జరిగే ఒప్పందాలను ఆయన ప్రస్తావించే అవకాశాలు కన్పిస్తున్నాయి. హౌడీ మోదీ సభలో అమెరికాలోని అత్యున్నత స్థాయి అధికారులు కూడా పాల్గొనబోతున్నారు.