మోదీకి, ట్రంప్ కి తలనొప్పిగా మారిన ‘అతి’వాద మద్దతుదారులు!

 

మోదీ, ట్రంప్ ఇద్దరూ ఒకే రకం నాయకులు కాదు! కాని, ఇద్దరూ ఒకే రకమైన వివాదాస్పద నేతలు! ఎట్ లీస్ట్, నిజంగా వివాదాస్పదం అయినా కాకున్నా వారి ప్రత్యర్థులు, విమర్శకుల దృష్టిలో మాత్రం ఇద్దరూ ఒకే రకమైన నాయకులు! అమెరికాలో తాజాగా చెలరేగిన హింస, దానికి ట్రంప్ స్పందన ఈ విషయం మరోసారి ఋజువు చేసింది!

 

ఇంతకీ… అమెరికాలోని వర్జీనియాలో వున్న చార్లెట్స్ విల్లేలో జరిగింది ఏమిటి? సింపుల్ గా చెప్పుకుంటే… అమెరికాలో నివురుగప్పిన నిప్పులా వుండే వైట్స్ , బ్లాక్స్ గొడవ మళ్లీ రాజుకుంది! అమెరికా అంటే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం, ఆహా, ఓహో అనుకుంటాం. కాని, అక్కడ ఒకప్పుడు నల్లటి వార్ని కట్టుబానిసలుగా చూసేవారు. అమెరికా తొలి అధ్యక్షుడు వాషింగ్ టన్ తో సహా చాలా మంది నాయకులు బానిసత్వానికి మద్దతుగానే వుండేవారు! అబ్రహం లింకన్ తరువాత మాత్రమే బానిసత్వం నిషేధించబడింది! అయినా కూడా ఇప్పటికీ అమెరికాలోని కొంత మంది అతివాద తెల్లవాళ్లకి నల్లవారన్నా, ఇతర వర్ణాల వారన్నా చులకన భావం, ద్వేష భావమే! అలాంటి ఎక్స్ ట్రీమ్ రైట్ వింగ్ వైట్ అమెరికన్సే చార్లెట్స్ విల్లేలో గొడవకి కారణం అంటున్నారు చాలా మంది!

 

బానిసత్వాన్ని సమర్థించిన యూఎస్ సివిల్ వార్ కాలం నాటి ఆర్మీ జనరల్ రాబర్ట్ ఈ లీ విగ్రహాన్ని తొలగించటాన్ని కొందరు వైట్ రైటిస్టులు వ్యతిరేకించారు. అంతే కాదు, పెద్ద ఎత్తున ఆయుధాలు పట్టుకుని రోడ్ల మీదకొచ్చి నిరసనలకి దిగారు. వారికి వ్యతిరేకంగా లెఫ్ట్ భావజాలం వున్న అభ్యుదయవాదులు కూడా నిరసనలకి దిగారు. చివరకు ఒకర్నొకరు రెచ్చగొట్టుకుని దాడులు చేసుకునేదాకా పరిస్థితి వెళ్లింది. ఆ ఘర్షణల్లో అతివాద తెల్లవారి సమూహంలో ఒకరు తన కార్ తో లెఫ్ట్ నిరసనకారులపైకి దూసుకొచ్చారు. దాంతో ఒక స్త్రీ చనిపోగా, 19మందికి గాయాలయ్యాయి.

 

శాంతి భద్రతలకి పెట్టింది పేరైన అగ్ర రాజ్యంలో ఇంత రచ్చ జరుగుతోంటే ట్రంప్ మాత్రం తప్పు ఇరు వైపులా వుందంటూ స్టేట్మెంట్ ఇచ్చి విమర్శకుల్ని మరింత రెచ్చగొట్టాడు. నిర్ద్వంద్వంగా తెల్లవారిది తప్పని చెప్పకుండా తప్పు అన్ని వైపులా జరిగిందంటూ అతివాదుల్ని వెనకేసుకొచ్చాడు. దాని తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. పుట్టుకతోనే ఎవ్వరూ ద్వేషించటం నేర్చుకోరని, ప్రేమించటం మనమే నేర్పాలని ఒబామా ట్వీట్ చేయటంతో అది పెద్ద దుమారంగా మారింది. ట్రంప్ ను ద్వేషించే వారు, ఒబామాను అభిమానించే వారు అందరూ ట్విట్టర్ లో లైకుల వర్షం కురిపించారు. ఒబామా చార్లెట్స్ విల్లే వయోలెన్స్ ని వ్యతిరేకిస్తూ చేసిన ట్వీట్ ట్విట్టర్ చరిత్రలోనే అత్యధిక లైకులు పొందింది! దీన్ని బట్టి ట్రంప్ వ్యతిరేకత జనాల్లో ఎంత వుందో అర్థం చేసుకోవచ్చు.

 

తన మీద ఎన్ని విమర్శలు వస్తోన్న ట్రంప్ మాత్రం తప్పు అందరిదీ అనే నొక్కి చెబుతున్నాడు. కేవలం రైట్ వింగ్ వైట్ ప్రొటెస్టర్స్ ది మాత్రమే తప్పని చెప్పటానికి ఆయన అంగీకరించటం లేదు. అందుక్కారణం ఆయనకు ఆ వర్గంలో భారీగా మద్దతుదారులుండటమే! ఇంతకీ, ఇదంతా విన్నాక మీకు మన దేశంలో ఏం గుర్తొస్తోంది? గోరక్షకులమని చెప్పి దాడులు చేస్తూ మోదీకి తలనొప్పిగా మారిన వారే కదా! గో సంరక్షకుల్ని కఠినంగా విమర్శిస్తే మోదీకి నష్టం. అలాగని వార్ని అలాగే వదిలేస్తే కూడా ప్రధాని ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. ట్రంప్ పరిస్థితి కూడా అలానే వుందని చెప్పవచ్చు! ఇక్కడి లాగే అమెరికాలోనూ రైట్ వింగ్ అతి వాదులు చెలరేగిపోతున్నారు. చూడాలి మరి … మోదీ లాగా ట్రంప్ కూడా బ్యాలెన్స్ చేస్తూ రాజకీయం కొనసాగిస్తారా? లేక ఏకపక్షంగా తన మద్దతు దారులకి వత్తాసు పలికి మరిన్ని గొడవలకి కారణం అవుతాడా?