జాతీయ పార్టీగా టీఆర్ఎస్.! ఏపీ, మహారాష్ట్ర, కర్నాటకలో పోటీకి సన్నాహాలు.!

 

నేషనల్ ఫ్రంట్ తో కేంద్రంలోనూ చక్రం తిప్పుతామంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు హడావిడి చేసిన గులాబీ బాస్ కేసీఆర్.... టీఆర్ఎస్ కు జాతీయ పార్టీ గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తూ, పలు రాష్ట్రాల ప్రజల సైతం ఆకట్టుకున్న కేసీఆర్... తన పథకాలకు లభిస్తోన్న ఆదరణ, గుర్తింపుతో, రెండు మూడు రాష్ట్రాలకు పార్టీని విస్తరించాలని వ్యూహరచన చేస్తున్నారట. ముఖ్యంగా తనకు ఎక్కువగా గుర్తింపు ఉన్న... ఆంధ్రప్రదేశ్, అలాగే కర్నాటక, మహారాష్ట్రల్లో పోటీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎలాగూ కేసీఆర్ ఎవరో తెలుసు... టీఆర్ఎస్ గురించి... కేసీఆర్ పరిపాలన గురించి తెలుసు. అయితే, కర్నాటక, మహారాష్ట్ర వాసులకు ఎలా తెలుస్తుందనుకుంటున్నారా? ఇక్కడే కేసీఆర్ తెలివిగా, పావులు కదుపుతున్నారు. కర్నాటక, మహారాష్ట్రల్లో తెలుగువాళ్లు ఉండే ప్రాంతాల్లో పోటీకి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా కర్నాటకలోని బళ్లారి, మహారాష్ట్రలోని నాందేడ్ లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే, నిజాం హయాంలో ఈ రెండు ప్రాంతాలూ తెలంగాణలోనే ఉండటమే కాకుండా, ఇఫ్పటికీ అక్కడ అధిక సంఖ్యలో తెలుగు ప్రజలు ఉండటంతో, వాటిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కేసీఆర్ ను కలిసిన పలువురు మహారాష్ట్ర నేతలు... తెలంగాణలో అమలవుతోన్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని, మహారాష్ట్ర ప్రజలను కూడా ఆకట్టుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు మహారాష్ట్రలోనూ టీఆర్ఎస్ పోటీచేస్తే మంచి ఆదరణ లభిస్తుందని వివరించారు. దాంతో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడానికి కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకరించారని చెబుతున్నారు. ముఖ్యంగా నాందేడ్ జిల్లాలోని దెగ్లూర్, నాయిగాం, భోకర్, హిమాయత్ నగర్, కిన్ వట్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పోటీకి దిగనున్నట్లు తెలుస్తోంది. అలాగే, కర్నాటక బళ్లారిలోనూ పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారట. ఇకపోతే మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోనూ బరిలోకి దిగాలని డిసైడ్ చేశారట. త్వరలో జరగనున్న ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగాలని ఆలోచిస్తున్నారట. మొత్తానికి జాతీయ హోదాపై కన్నేసిన టీఆర్ఎస్.... ఏపీ, మహారాష్ట్ర, కర్నాటకలో పోటీకి దిగబోతోంది. మరి, తెలంగాణలో తిరుగులేని పట్టుసాధించిన గులాబీ పార్టీ, పక్క రాష్ట్రాల్లో పాగా వేయాలన్న వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో... జాతీయ పార్టీగా అవతరించాలన్న కల నెరవేరుతుందో లేదో చూడాలి.