టికెట్ రాలేదంటే పార్టీ సభ్యత్వమే పోయింది

 

పార్టీ టికెట్ రాలేదని అసంతృప్తి చెందుతుంటే ఏకంగా సభ్యత్వమే పోతే ఆ నేత పరిస్థితి పుండు మీద కారం చల్లినట్లే ఉంటుంది.ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయడం, 105 మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్‌ లేదా వేరే స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని తెరాస ఎమ్మెల్సీ రాములు నాయక్‌ కొన్నాళ్లుగా భావిస్తున్నారు.దీనికి సంబంధించి పార్టీ అధిష్ఠానంతో ఎప్పటి నుంచో సంప్రదింపులు జరుపుతున్నారు.కానీ ఆ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికే టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం మరోసారి అవకాశం ఇచ్చింది.దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు.మరోవైపు నారాయణఖేడ్‌ నుంచి రాములు నాయక్‌కు అవకాశం కల్పించాలని పలు గిరిజన సంఘాలు ఇప్పటికే డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.దీనికితోడు రాములు కాంగ్రెస్‌ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి.ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాతో పాటు కాంగ్రెస్‌ అగ్రనేతలను ఆయన కలిసినట్లు జోరుగా ప్రచారం జరిగింది.దీన్ని ఆయన ఖండించకపోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశంలో తన భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం ప్రకటిస్తానని రాములు తెలపడంతో తెరాస అధిష్ఠానం స్పందించింది.ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆయన్ని సస్పెండ్‌ చేస్తున్నట్లు పార్టీ అధిష్ఠానం ప్రకటించింది.రాములు నాయక్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.