టీఆర్ఎస్ లో మున్సి-పోల్స్ రగడ... టికెట్ల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి

 

 

ముందస్తు అసెంబ్లీ ఎన్నికలతో గతేడాది తెలంగాణలో మొదలైన ఎన్నికల హడావిడి దాదాపు ఏడాదిగా కొనసాగుతోంది. రెండు మూడు నెలల గ్యాప్ తో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు... ఆ తర్వాత సార్వత్రి ఎన్నికలు... అనంతరం జెడ్పీ, పంచాయతీ ఎన్నికలు జరగ్గా... ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ సిద్ధమవుతోంది. తెలంగాణలో మున్సిపోల్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం మున్సిపోల్స్ నిర్వహణపై సమీక్ష నిర్వహించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

మున్సిపోల్స్ కు రంగంసిద్ధమవుతుండటంతో ప్రధాన పార్టీల్లో హడావిడి మొదలైంది. టికెట్ల కోసం ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నోటిఫికేషన్ కంటే ముందుగా తమ టికెట్ ను కన్ఫ్మామ్ చేసుకునేందుకు పైరవీలు మొదలుపెట్టారు. ప్రతి వార్డు, డివిజన్ నుంచి కనీసం అరడజను మంది టికెట్ కోసం పోటీపడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ లో పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. వార్డు మెంబర్ నుంచి మేయర్ పీఠం వరకు టికెట్లు దక్కించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు చుట్టూ ఆశావహులు తిరుగుతున్నారు. ఎప్పట్నుంచో మీ గెలుపు కోసం పనిచేశాను... ఇఫ్పుడు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే, అనుచరుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఏం చేయాలో తెలియక టీఆర్ఎస్ ముఖ్యనేతలు తలల పట్టుకుంటున్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే, టికెట్ల కేటాయింపు తమ చేతిలో ఉండదని, అధిష్టానమే నిర్ణయిస్తుందంటూ తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. దాంతో, మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.     

మొత్తానికి నవంబరు నెలాఖరులోపే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో.... అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, అసెంబ్లీ, జెడ్పీ, పంచాయతీల్లో ఎన్నికల మాదిరిగానే అన్ని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో గులాబీ పార్టీ ముందుకెళ్తోంది. అయితే, టికెట్ల లొల్లి... ప్రతి వార్డు, డివిజన్ లో మూడేసి గ్రూపులు ఉండటం.... టీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని అంటున్నారు.