అర్థంకాని కేసీఆర్‌ ఆంతర్యం... మంత్రులకు ప్రాధాన్యత తగ్గించడంపై వదంతులు

టీఆర్‌ఎస్ ప్లీనరీతో కొంపల్లి పరిసరాలన్నీ గులాబీమయమైయ్యాయి. ఎటువైపు చూసినా గులాబీ జెండాలు, తోరణాలు, హోర్డింగులే కనిపిస్తున్నాయి. ఉదయం పదిన్నరకు ప్రారంభమైన ప్లీనరీ.... సాయంత్రం 5గంటల వరకు సాగనుంది. కేసీఆర్‌... పార్టీ జెండా ఆవిష్కరించి.... తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించడంతో ప్రారంభమై... కేసీఆర్‌ చివరి ప్రసంగంతో ప్లీనరీ ముగియనుంది. ఇక ప్లీనరీకి విచ్చేసే ప్రతినిధులకు పసందైన విందు ఏర్పాటుచేశారు. తెలంగాణ వంటకాలన్నీ మెనూలో చేర్చారు.

 

అయితే గత ప్లీనరీలతో పోల్చితే ఈసారి భిన్నంగా జరుగుతోంది. పార్టీ అధినేత కేసీఆర్‌ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మంత్రులకు ప్రాధాన్యత తగ్గించి... ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రయార్టీ పెంచారు. అలాగే కేటీఆర్‌కి గానీ, హరీష్‌రావుకి గానీ, కవితకు గానీ తీర్మానాల బాధ్యత అప్పగించలేదు. మొత్తం ఏడు తీర్మానాలు... ఏడుగురు ప్రవేశపెడితే..మరో ఏడుగురు వాటిని బలపరుస్తూ ప్రసంగిస్తారు. 

 

వ్యవసాయంపై ప్లానింగ్ బోర్డు ఛైర్మన్ నిరంజన్ రెడ్డి, కుల వృత్తుల గురించి ఎమ్మెల్యే కొండా సురేఖ, మిషన్ భగీరథపై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, విద్యుత్ రంగంపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పథకాల గురించి ఎంపీ వినోద్, సంక్షేమంపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పేకాట, మద్యనియంత్రణ, అనవసర ఆపరేషన్ల కట్టడి తీర్మానాలపై ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ మాట్లాడనున్నారు. తీర్మానాల జాబితాలో ఎక్కడా మంత్రుల పేర్లు లేకపోవడం కేసీఆర్ ఆంతర్యం అర్థంకాక నేతలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. 

 

అయితే క్షేత్రస్థాయి పరిస్థితి మంత్రులకంటే నేతలకే ఎక్కువ తెలుసని, అందుకే తీర్మానాలపై మాట్లాడే బాధ్యతను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించారని తలసాని చెప్పుకొచ్చారు. మొత్తానికి సీఎం కేసీఆర్ తాజా నిర్ణయం పార్టీలో పెద్ద చర్చకే తెరలేపింది.