గొర్రెలం, బర్రెలం కాదు.. రాజీనామా చేస్తాం: కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు

 

సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయడం రాజ్యాంగ బద్ధమేనని కాంగ్రెస్‌ నుంచి టీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చారు.
 
టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ.. గ్రూపు రాజకీయాలు, నాయకత్వ లేమితో కాంగ్రెస్‌ కొట్టుమిట్టాడుతోందన్నారు. భవిష్యత్‌పై భరోసా లేకే పార్టీ మారామని, అవసరమైతే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం.. సీఎల్పీని విలీనం చేయాలని కోరామని, చట్ట ప్రకారం విలీనం జరిగినా ఇప్పటి వరకు టీఆర్ఎస్ కండువా కప్పుకోలేదన్నారు. పదవుల కోసం చిల్లర మల్లరగా తిడితే ఊరుకునేది లేదని, పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఇటీవ జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క జడ్పీ పీఠాన్ని కూడా కైవసం చేసుకోలేక పోయిందని ఎద్దేవా చేశారు.

మరో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల ఆకాంక్ష మేరకే తాము పార్టీ మారామని వివరించారు. కాంగ్రెస్‌పై తమకున్న అసంతృప్తిని చాలా సార్లు వ్యక్తం చేశామని.. రాజ్యాంగం పదో షెడ్యూల్ ప్రకారమే టీఆర్ఎస్‌లో చేరామని తాము ప్రలోభాలకు లొంగిపోవడానికి, అమ్ముడుపోవడానికి గొర్రెలం, బర్రెలం కాదన్నారు. త్రిపుర, గోవాలలో కూడా ఇలాంటి విలీనాలే జరిగామని.. ప్రధాని కూడా ఇటీవల బెంగాల్‌లో 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని తెలిపిన సంగతిని రమణారెడ్డి ప్రస్తావించారు. ‘‘వరుస ఓటముల తర్వాత కూడా కాంగ్రెస్‌ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదు. ఎంతో మంది నేతలు పార్టీ మారుతున్నా.. ఉత్తమ్‌ వ్యవహారశైలి మారటం లేదు. మాపై అనవసర విమర్శలు చేస్తే కాంగ్రెస్‌ నేతలపై పరువునష్టం దావా వేస్తాం. మొన్నటి వరకు ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. బ్యాలెట్‌ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.’’ అని అన్నారు.

ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. మమ్మల్ని విమర్శిస్తున్న వారు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ చదువుకుంటే మంచిదని, వేరే రాష్ట్రాల్లో ఇలాంటి చాలా జరిగాయని గుర్తు చేశారు.