తెరాస-టీడీపీ వాగ్వాదం

శుక్రవారం లోక్‌సభలో కేంద్రంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా  టీఆర్ఎస్ ఎంపీ వినోద్ మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రభుత్వం రాగానే ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని విమర్శించారు.ఏడు మండలాలు కలిపితేనే తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని మోదీకి చెప్పినట్లు చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పారని, ఇందుకు తెలంగాణ ప్రజలు ఎప్పటికీ బీజేపీని క్షమించరని అన్నారు.ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ-టీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

 

 

రెండు రాష్టాలలో హైకోర్టులు ఉండాలని చట్టంలో ఉంది.కానీ ఇంతవరకు హైకోర్టు విభజన పూర్తి కాలేదు.ఏపీ సీఎం ధోరణి వల్లే హైకోర్టు విభజన ఆలస్యమవుతోందని విమర్శించారు.కాంగ్రెస్ గెలిస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని రాహుల్‌గాంధీ అంటున్నారని, హోదా ఇవ్వడమంటే పారిశ్రామిక రాయితీలు కూడా ఇస్తారా? రాహుల్ చెప్పాలన్నారు. ఏపీ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని వినోద్ డిమాండ్ చేశారు.కృష్ణ,గోదావరి పై ప్రాజెక్టుల నిర్మాణంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు.పోలవరానికి నిధులిచ్చే విషయంలో తమకు అభ్యంతరంలేదని, కాళేశ్వరానికీ జాతీయ హోదా ఇవ్వాలని వినోద్‌ డిమాండ్ చేశారు.బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఊసే కేంద్రం ఎత్తడంలేదని, గిరిజన యూనివర్సిటీకి స్థలం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వినోద్ తెలిపారు. మిషన్‌కాకతీయతో 46 వేల చెరువులను పునరుద్ధరిస్తున్నామని వినోద్ చెప్పారు. మిషన్‌ కాకతీయకు నీతి అయోగ్‌ రూ.5 వేల కోట్లు ఇవ్వాలన్నా,ఆర్థికశాఖ అడ్డుకుందని వినోద్‌ విమర్శించారు. రూ.40 వేల కోట్లతో మిషన్‌ భగీరథ చేపట్టామని, త్వరలో ఇంటింటికీ మంచినీరు ఇవ్వబోతున్నామని ఎంపీ వినోద్‌ పేర్కొన్నారు.