బెదిరింపా? జంపింగా? టీఆర్ఎస్ ను షేక్ చేసి తుస్సుమనిపించిన షకీల్

 

మంత్రివర్గ విస్తరణ తర్వాత టీఆర్‌ఎస్‌లో అసమ్మతి బయటపడుతోంది. ఒకరి తర్వాత మరొకరు తమ అసంతృప్తిని బయటపెడున్నారు. అధిష్టానానికి వ్యతిరేకంగా అసలు నోరు విప్పడానికే భయపడే నేతలు సైతం ఇప్పుడు ధైర్యంగా తమ మనసులో మాటను బయటపెట్టేస్తున్నారు. ఇప్పటికే పలువురు... తమ ఆవేదనను ఆక్రోశాన్ని వెళ్లగక్కగా... బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్‌ ఏకంగా బీజేపీ ఎంపీ అర్వింద్‌తో సమావేశమై కలకలం రేపారు. అంతేకాదు కష్టపడి పనిచేసేవాళ్లకు టీఆర్ఎస్ లో అసలు విలువే లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఆత్మాభిమానం చంపుకొని ఇక టీఆర్ఎస్ లో ఉండలేనని అన్నారు. ఒకే ఒక్క మైనారిటీ ఎమ్మెల్యే గెలిస్తే మంత్రి పదవి ఇవ్వలేదన్న షకీల్... అయినా ప్రతి దానికీ ఎంఐఎం చెప్పినట్లు టీఆర్‌ఎస్‌ వింటే ఎలా అంటూ ప్రశ్నించారు. ఇక టీఆర్ఎస్ లో ఉండలేకపోతున్నానని, అవసరమైతే రాజీనామాకు సిద్ధమంటూ ఫీలర్లు వదిలారు.

అయితే, కేబినెట్‌ విస్తరణలో మంత్రి పదవి ఆశించిన షకీల్‌... అది దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. దాంతో, నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్‌తో సమావేశమై... పార్టీ మారేందుకు చర్చలు జరిపారని అంటున్నారు. అంతేకాదు ధర్మపురి అర్వింద్ తో అన్ని విషయాలూ మాట్లాడానని, సోమవారం మిగతా విషయాలు చెబుతానంటూ మీడియాకి లీకులు వదిలారు. దాంతో షకీల్... బీజేపీలో చేరడం ఖాయమనే వార్తలు వచ్చాయి. అదే సమయంలో తమతో పలువురు టీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు.

షకీల్ మీటింగ్స్ అండ్ కామెంట్స్ తో షేకైన టీఆర్ఎస్ అధిష్టానం వెంటనే రంగంలోకి దిగింది. షకీల్ తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్... బుజ్జగించినట్లు తెలుస్తోంది. దాంతో అప్పటికప్పుడే షకీల్ మాట మార్చేశారు. కేసీఆర్ వల్లే తాను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకొచ్చారు. అంతేకాదు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్‌తో కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానంటూ తుస్సుమనిపించారు.