లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నా! టీఆర్ఎస్ లో రసమయి కలకలం 

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి తీవ్ర స్థాయిలో ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీ పెద్దల తీరుపై ఆగ్రహంగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా వాయిస్ పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. కరంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గులాబీ పార్టీలో సెగలు రేపుతుందోని తెలుస్తోంది. మహబూబాబాద్‎లో ప్రముఖ కవి జయరాజు తల్లి సంతాప సభలో మాట్లాడిన రసమయి బాలకిషన్.. సొంత పార్టీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

తాను  అధికారపార్టీ ఎమ్మెల్యేగా ఉండటంతో తన సహజత్వాన్ని కోల్పోయానన్నారు రమసయి. ప్రస్తుతం తానో లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నానంటూ సంచలనం కామెంట్లు చేశారు. తాను ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉండటంతో చాలా మందికి దూరమయ్యానన్నారు. సమాజంలో కవులు, కళాకారులు మౌనంగా ఉండటం క్యాన్సర్ కంటే ప్రమాదకరమంటూ మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రసమయి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. 

 తెలంగాణ ఉద్యమంలో ముందున్నారు రసమయి బాలకిషన్. ధూంధాం ద్వారా ప్రత్యేక రాష్ట్ర వాదన వినిపించారు. తెలంగాణ ఉద్యమంలో పాటలే ప్రధాన పాత్ర పోషించాయని చెబుతారు. 2014 తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే మానకొండూరు నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు బాలకిషన్. 2018లో రెండోసారి గెలుపొందారు. ప్రభుత్వ పథకాలను, సీఎం కేసీఆర్‌ను ప్రశంసిస్తూ అసెంబ్లీలో సైతం తన పాటలతో దుమ్ములేపినరసమయి చేసిన తాజా వ్యాఖ్యలు... అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చాలా మందికి తాను దూరమయ్యారంటూ వ్యాఖ్యానించడం దేనికి సంకేతమన్న చర్చ జరుగుతోంది. కొంత కాలంగా టీఆర్ఎస్ ముఖ్య నేతలతో రసమయికి గ్యాప్ పెరిగిందనే చర్చ జరుగుతోంది. తన నియోజకవర్గంలోనూ కొందరు నేతలు కేసీఆర్ కుటుంబం పేరుతో పెత్తనం చలాయిస్తున్నారని రసమయ తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారని చెబుతున్నారు.  తన అసంతృప్తిగా ఇలా బయటికి చెప్పారని చెబుతున్నారు.