విలీనం ఫిక్సయిందా?

 

trs merger with congress, Congress gameplan Rayala Telangana,sonia gandhi, Cabinet approves Telangana, kcr, trs congress

 

 

కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం ఫిక్సయిన సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దాని పరిణామమే కేంద్రం ఏకపక్షంగా, పూర్తిగా తెలంగాణ ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరించడమని విశ్లేషిస్తున్నారు. మూడు నెలల క్రితం తెలంగాణ ఇవ్వడానికి అంగీకారం తెలిపిన కాంగ్రెస్ పార్టీ తాను ఇలా తెలంగాణకు అంగీకారం తెలుపగానే టీఆర్ఎస్ అలా తనలో విలీనం అయిపోతుందని ఆశించింది. అయితే కాంగ్రెస్ అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి! అప్పటి తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని తాయిలం ఆశ చూపిస్తూ వచ్చిన కేసీఆర్ తీరా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించిన తర్వాత ప్లేటు ఫిరాయించేశాడు.

 

విలీనం లేదు తోటకూర కట్టా లేదంటూ షాకిచ్చాడు. తెలంగాణ ఏర్పడితే తన పార్టీకే అధికారం వస్తుందని కలలు కనడం ప్రారంభించాడు. కాంగ్రెస్ దగ్గర తల ఎగరేయడం షురూ చేశాడు. కేసీఆర్ని దారిలోకి తేవడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ మొండిఘటం లొంగకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తనమార్కు రాజకీయం ప్లే చేసిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర విభజన బిల్లు కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందే ముందు రోజున ‘ఇచ్చేది రాయల తెలంగాణ’ అనే మాటను లీక్ చేయడం ద్వారా కేసీఆర్‌ని దారిలోకి తెచ్చిందని, కేంద్రం ‘రాయల తెలంగాణ’ ఇవ్వబోతోందన్న వార్త బయటకు రాగానే కేసీఆర్‌లో టెన్షన్ పెరిగి కాంగ్రెస్‌కి దాసోహం అన్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.



రాత్రికి రాత్రే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనానికి సంబంధించిన ఒప్పందాలు చాలా పకడ్బందీగా కుదిరి వుండవచ్చన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ విలీనం విషయంలో తల ఎగరేసిన కేసీఆర్‌కి కీలక సందర్భంలో విలీనానికి ఒప్పుకోక తప్పని పరిస్థితిని కాంగ్రెస్ అధిష్ఠానం సృష్టించిందని, కేసీఆర్‌ని దారిలోకి తేవడానికి ‘రాయల తెలంగాణ’ అస్త్రాన్ని విజయవంతంగా వాడుకుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఈ రాజకీయ వికృత క్రీడలో తెలుగు ప్రజలు ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో!