కాంగ్రెస్‌ మేనిఫెస్టోని తెరాస కాపీ కొట్టింది

 

తెలంగాణలో ఎన్నికల వేడి మొదలవడంతో పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేసి ప్రజలను ఆకట్టుకొనే పనిలో పడిపోయాయి. తాజాగా కేసీఆర్ కూడా తెరాస పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మేనిఫెస్టోపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడిన ఉత్తమ్.. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను మక్కీకి మక్కీ కాపీ కొట్టిన సీఎంది సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. నాలుగున్నర ఏళ్లు పదవిలో ఉండి పలు వాగ్దానాలు అమలుచేయని కేసీఆర్‌..రాష్ట్రంలోని రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు అందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గత కొన్నాళ్లుగా కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కాదని, దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్లన్నిటిని కలిపినా సరిపోవని హేళన చేసిన తండ్రీ కొడుకులు ఇప్పుడేం సమాధానం చెప్తారని కేసీఆర్‌, కేటీఆర్‌ లను ఉత్తమ్‌ ప్రశ్నించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం నాలుగున్నర ఏళ్ల పాలనలో ఎందుకు అమలు చేయలేదో చెప్పాలన్నారు. అబద్దపు మాటలతో మరోసారి మోసం చేయడానికి సీఎం ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని తెలంగాణ సమాజం గ్రహించాలని కోరారు.

2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏం అమలు చేశారు? ఏం చేయలేదో? అనే వాటి గురించి చెప్పకుండా కాంగ్రెస్‌ వాగ్దానాలను కాపీ కొట్టడం కన్నా దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నపుడు ఏకకాలంలో రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నన్నాళ్లు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు? పైగా కాంగ్రెస్‌ ఇచ్చిన హామీనే ఏ ప్రాతిపదికన చేస్తారని మండిపడ్డారు. అంతమంది నిరుద్యోగులు ఎక్కడ ఉన్నారు? అంతమందికి డబ్బులు ఎలా ఇస్తారని మాట్లాడిన కేసీఆర్‌ ఇప్పుడు.. తెలంగాణలో 12, 13 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అంగీకరించారని తెలిపారు. ఇన్నాళ్లు మోసం చేసినందుకు నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. వివిధ రకాల పింఛన్లను పెంచుతామని కాంగ్రెస్‌ ఎప్పటి నుంచో చెబుతుంటే ఇన్నాళ్లు నిద్రపోయి ఇప్పుడు తామూ పెంచుతామంటూ కేసీఆర్‌ ప్రకటించారని దీనికి గాను ఆయా వర్గాలకు కూడా క్షమాపణలు చెప్పాలన్నారు.

హైదరాబాద్‌లో లక్ష, ఇతర అన్ని జిల్లాల్లో కలిపి 1.60 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని మాట తప్పిన కేసీఆర్‌..ఇప్పుడు మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. రూ.5లక్షలతో సొంత స్థలంలోనే లబ్ధిదారులకు రెండు పడకల ఇళ్లు కట్టిస్తామని కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని కూడా కేసీఆర్‌ కాపీ కొట్టారని ఆరోపించారు. తెరాస పాలనలో 4500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఒక్క బాధిత కుటుంబాన్నీ కేసీఆర్‌ పరామర్శించలేదని విమర్శించారు. ఏకకాలంలో రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసి.. ఇప్పుడు మరోసారి అదే హామీతో దగా చేసేందుకు కేసీఆర్‌ సిద్ధమయ్యారని మండిపడ్డారు. మొత్తానికి ఉత్తమ్ కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోని అంశాలతో తెరాస పాక్షిక మేనిఫెస్టోను పోల్చుతూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.