రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఓడిపోవడం ఖాయం

 

గత ఎన్నికల్లో కేసీఆర్‌ తనకు రూ.10 కోట్లు ఇస్తా అన్నారని నాయిని నర్సింహా రెడ్డి మీడియాతో అన్నారు.దీంతో నాయిని నర్సింహా రెడ్డి చేసిన ప్రకటనను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ సూమోటోగా స్వీకరించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు‌ రేవంత్‌ రెడ్డి కోరారు.ఆ రూ.10 కోట్లు ఎలా వచ్చాయో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నాయిని నర్సింహారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చిల్లరగాడని, ఈసారి కొడంగల్‌లో ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. తాను ముషీరాబాద్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన దానిపై రేవంత్ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పొరపాటున గత ఎన్నికల సందర్భంగా రూ.5, 10 లక్షలో కేసీఆర్‌ ఇస్తానన్నారు అనటానికి బదులు రూ.10 కోట్లు అన్నానని వివరణ ఇచ్చారు. గత ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని చెబితే ఈ ఎన్నికలకు ముడి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ లాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తే అది కాంగ్రెస్‌కే నష్టమని నాయిని తెలిపారు.