నా 30 లక్షలు ఇవ్వు వీరేశం అన్న.. చనిపోయిన వ్యక్తి పేరుతో ఫ్లెక్సీ

ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వెళ్తున్న పలువురు టీఆర్ఎస్ అభ్యర్థులకు నిరసన సెగలు తగులుతున్న విషయం తెల్సిందే. నిరసన సెగ తగిలిన వారిలో నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఉన్నారు. ఇప్పటికే ఆయన మీద పలు ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా ఒక గ్రామంలోని స్థానికులంతా కలిసి.. వీరేశం ఓ కుటుంబానికి అన్యాయం చేసారు అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. ఆయన తమ గ్రామంలో ప్రచారం చేయడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు.

 

 

నేరడ గ్రామానికి చెందిన దుబ్బాక సతీష్ రెడ్డి, నర్సింహరెడ్డి సోదరులకు రాజకీయ నేతలుగా స్థానికంగా మంచి పేరుంది. మొదటినుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీరిద్దరూ తరువాత టీఆర్ఎస్ లో చేరారు. అయితే 2014 ఎన్నికల సమయంలో వీరేశంకు దుబ్బాక సతీష్ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తే చివరకు అతని కుటుంబానికి అన్యాయం చేసారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వీరేశంకు సతీష్ రెడ్డి 30 లక్షల రూపాయలు ఇచ్చారని.. అవి తిరిగి ఇస్తానంటూ ఇంతవరకు ఇవ్వలేదని మండిపడుతున్నారు. గతేడాది సతీష్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన కుటుంబానికి వీరేశం డబ్బులు చెల్లిస్తానని చెప్పి.. చివరకు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. అయితే వీరేశం ప్రచారానికి గ్రామంలోకి వస్తున్నారనే సమాచారంతో.. చనిపోయిన సతీష్ రెడ్డి పేరిట గ్రామస్థులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 'నాకు ఇవ్వవలసిన 30 లక్షల రూపాయలు మా కుటుంబ సభ్యులకు చెల్లించు వీరేశం అన్న' అనేది దాని సారాంశం. అంతేకాదు చనిపోయిన ఓ మంచి వ్యక్తి కుటుంబాన్ని మోసం చేయాలనుకోవడం భావ్యం కాదని మండిపడుతున్నారు.

 

 

కొందరు టీఆర్ఎస్ నేతలు మాత్రం నేరడ గ్రామస్థుల తీరును తప్పుబడుతున్నారు. నల్లగొండ టీఆర్ఎస్ ఇంఛార్జ్ పదవి నుంచి దుబ్బాక సతీష్ రెడ్డి సోదరుడు నర్సింహరెడ్డిని తప్పించి కంచర్ల భూపాల్ రెడ్డికి అప్పగించడంలో వీరేశం పాత్ర లేదని చెబుతున్నారు. ఇందులో వీరేశం పాత్ర ఉందనే అపోహతో నేరడ గ్రామస్థులు ఇలా చేయడం సరికాదంటున్నారు. ఒకవేళ సతీష్ రెడ్డి వాస్తవంగా వీరేశంకు డబ్బులు ఇచ్చినట్లైతే కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుందని చెబుతున్నారు. చూద్దాం మరి ఈ సమస్య పరిష్కారం అవుతుందో లేదో.