నా కొడుకేం చిన్న పిల్లాడు కాదు...

 

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పార్టీ మారుతున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీని వీడి మళ్లీ సొంత గూటికే డీఎస్ చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై స్పందించిన డీఎస్ తాను పార్టీ మారేది లేదని.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన కొడుకు ఇచ్చిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డీఎస్ రెండో కుమారుడు అరవింద్ ఓ పత్రికకు భారీ ప్రకటన ఇచ్చారు. అందులో 'జాతి మొత్తం మోదీ వెంటే నిలవాలి' అంటూ అరవింద్ ప్రకటన ఇచ్చారు. దీంతో డి.శ్రీనివాస్ పార్టీ మారుతున్నారనే వదంతులకు మరింత బలం చేకూరినట్టైంది.

 

మరోవైపు కొడుకు ప్రకటనపై స్పందించిన డీఎస్ తన కుమారుడు ఇచ్చిన ప్రకటనతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని ఆయన స్పష్టం చేశారు. అరవింద్ ఇచ్చిన ప్రకటనకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని.. అతనేమీ చిన్న కుర్రాడు కాదని, ఆ ప్రకటన వెనుక అర్థమేంటో అరవింద్ నే అడగాలని తెలిపారు.

 

కాగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమిపాలైన డీఎస్ ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. తొలుత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా డీఎస్ ను కేసీఆర్ నియమించారు. ఆ తర్వాత ఆయనకీ రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించారు. అయితే, ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ లో డీఎస్ క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. పార్టీ అధికారిక కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదు. దీంతో డీఎస్ పార్టీ మారుతారేమో అన్న అనుమానాలు తలెత్తాయి.