మోదీకి సాయం! ఏపీకి నష్టం! టీఆర్ఎస్ వ్యూహం!

ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ చూసినా ప్రత్యేక హోదా టాపిక్ గా నడుస్తోంది. అందరూ బీజేపీనే టార్గెట్ చేసుకుంటున్నారు. అయితే, ఏపీకి సాటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో హోదా విషయం పెద్దగా చర్చలో లేదు. జనం దాన్నసలు ఆలోచించటం లేదు. ఎందుకంటే, విభజన సమయంలో హైద్రాబాద్ తెలంగాణకు దక్కింది. అందుకే, స్పెషల్ స్టేటస్ లాంటివేవీ హామీ ఇవ్వలేదు. ఇక ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో చెప్పిన ఏపీకైనా వచ్చిందా అంటే అదీ లేదు. అది రాకపోవటం వల్లే ఇంత గొడవ జరుగుతోంది. అయితే, ఈ మొత్తం కోలాహలంలో టీఆర్ఎస్ పార్టీ పాత్ర ఆందోళనకరంగా, అనుమానాస్పదంగా వుంటోంది…

 

 

నిన్న మొన్నటి వరకూ ఎక్కడ అడిగినా టీఆర్ఎస్ వారు ఆంద్రాకు ప్రత్యేక హోదా ఇస్తే మాకు అభ్యంతరం లేదని చెప్పేవారు. విభజన హామీలు నెరవేర్చాల్సిందేనని అనేవారు. కానీ, అవిశ్వాస తీర్మానం వచ్చాక గులాబీ నేతల స్వరాల్లో మార్పు వచ్చేసింది. ఓటింగ్ సమయంలో గైర్హాజర్ అవ్వటం ద్వారా మోదీకి సాయం చేసిన కేసీఆర్ శిబిరం అక్కడితో ఆగకుండా పదే పదే ఏపీకి హోదా రాకుండా వుండేలా కామెంట్లు చేస్తోంది. ఆంద్రాకు స్పెషల్ స్టేటస్ ఇస్తే హైద్రాబాద్ కు వాణిజ్య, వ్యాపార పరంగా నష్టం అంటూ మోకాలు అడ్డుతోంది టీఆర్ఎస్. హోదా ఇస్తే రెండు తెలుగు రాష్ట్రాలకూ ఇవ్వాలని మెలిక పెడుతోంది. ఈ వాదన ద్వారా పరోక్షంగా మోదీకి అత్యంత అవసరమైన సహకారం అందిస్తోంది గులాబీ పార్టీ!

 

 

 

అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా కూడా నిరసనలు తెలిపారు టీఆర్ఎస్ ఎంపీలు. అంతే కాక పోలవరానికి కీలకమైన ముంపు మండలాల్ని తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. అది సాధ్యం కాదని తెలిసినా కేంద్ర ప్రభుత్వానికి సాయపడేలా ఆ మాట మాట్లాడారు. ఒకవైపు ప్రత్యేక హోదా, మరోవైపు పోలవరం రెండిటికీ కారు పార్టీ అడ్డుగా నిలుస్తోంది. దీని వల్ల టీఆర్ఎస్ కు వచ్చే లాభం ఏం లేకున్నా కేంద్రంలోని దిల్లీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవచ్చు. అదే ఎజెండాగా కనిపిస్తోంది. దానికి తగ్గట్టే కేసీఆర్ చంద్రబాబు కంటే బాగా పని చేసుకుపోతున్నారని మోదీ అనటం … కమలం, గులాబీల మధ్య ఒప్పందాన్ని బహిరంగంగానే స్పష్ఠపరుస్తోంది.

 

 

 

ఈ మద్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి పదే పదే మాట్లాడుతున్న టీఆర్ఎస్ నేతలు గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలపై కూడా స్పందించారు. ఆయనకు ఆంద్రా మీదే ప్రేమ తప్ప తెలంగాణ మీద లేదని అన్నారు. ఏపీకి హోదా ఇవ్వమని ఆజాద్ డిమాండ్ చేశారు. పార్లెమంట్లో కాంగ్రెస్ సీనియర్ నేత చేసిన డిమాండ్ ని టీఆర్ఎస్ తప్పుపట్టింది. ఆయన తెలంగాణ గురించి పట్టించుకోకుండా ఏపీ మీద ప్రేమ ఒలకబోస్తున్నారని గులాబీ నేత కర్నె ప్రభావకర్ అన్నారు. దీని ద్వారా తెలంగాణ కాంగ్రెస్ కార్నర్ చేయాలని ఆయన ప్రయత్నం. ఏపీకి కాంగ్రెస్ సాయం చేస్తోందని చెప్పటం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ ను విలన్ గా నిలపాలని టీఆర్ఎస్ వ్యూహం!

 

 

తెలంగాణలో కాంగ్రెస్ తమ ప్రతిపక్షం కాబట్టి టీఆర్ఎస్ దాడి చేయటం అర్థం చేసుకోవచ్చు. కానీ, ఏపీకి ఎలాంటి జాలీ లేకుండా ప్రత్యేక హోదా ఇవ్వనంటోన్న బీజేపికి లోపాయకారిగా సాయపడటం… కుట్రే అవుతుంది. లేదా వచ్చే ఎన్నికల తరువాత మోదీ సర్కార్ ఏర్పడితే టీఆర్ఎస్ అందులో మంత్రి పదవులు ఆశిస్తూ వుండాలి. ఏది ఏమైనా , ఎలాంటి రాజకీయ లబ్ధి వున్నా సాటి తెలుగు రాష్ట్రం నష్టపోయేలా వ్యూహాలు పన్నటం, కేంద్రానికి సాయం చేస్తూ ఏపీని ఎదగకుండా అడ్డుకోవటం… అస్సలు సమర్థనీయం కాదు. కేసీఆర్ దీనిపై పునరాలోచించుకోవాలి. లేదంటే తెలంగాణలోని, ముఖ్యంగా, హైద్రాబాద్ లోని ఆంధ్రుల ఓట్లపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు…