టీఆర్ఎస్‌లో అసలేం జరుగుతోంది? అగ్నిపర్వతం బద్దలుకాబోతుందా?

 

గులాబీ పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. కొద్దిరోజులుగా టీఆర్ఎస్ లో అసంతృప్తి రాజుకుంటోంది. ఎన్నడూ నోరెత్తని నేతలు తమ గొంతులు సమరించుకుంటున్నారు. ఎన్నడూ గీత దాటని నాయకులు, ధిక్కారగళంతో కళ్లెర్రజేస్తున్నారు. అధిష్టానానికి అతిదగ్గరగా ఉన్న నేతలే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. కేసీఆర్ గీసిన గీతను దాటని నేతలు, ఒకరి తర్వాత మరొకరు నోరు తెరుస్తున్నారు. ఈటల బాటలోనే ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. తమలో గూడకట్టుకున్న అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పూర్తిస్థాయి కేబినెట్ కూర్పుతో, ఇక మంత్రి పదవి రాదని డిసైడైన నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.

ఈటల, రసమయి మాటల మంటలు చల్లారకముందే, మరో రెండు గొంతులు ధిక్కార స్వరం వినిపించాయి. కేసీఆర్‌కు ఎంతో సన్నిహితుడిగా పేరున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ తమ ఇంటి పెద్ద అయితే... తామంతా ఓనర్లమేనంటూ ఈటల మాదిరిగానే కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ కిరాయిదార్లు ఎంతకాలం ఉంటారో చూద్దామంటూ సెటైర్లు వేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి, కేసీఆర్ మాట తప్పారంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే, కౌన్సిల్‌లో ఉండు... మంత్రి పదవి ఇస్తానంటూ కేసీఆర్ హామీ ఇచ్చారని, అయితే, ఇప్పుడు తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారంటూ ఊహాగానాలు వినిస్తున్నాయని, కానీ ఆ పదవి తనకు వద్దే వద్దన్నారు...... ఇక మాజీ డిప్యూటీ సీఎం, ఘన్ పూర్ ఎమ్మెల్యే, తాటికొండ రాజయ్య కూడా ఇదే తరహాలో కేసీఆర్ పై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. తెలంగాణలో 12శాతమున్న మాదిగలకు కేబినెట్‌లో చోటు దక్కలేదని, మాదిగల గురించి ఎవరో ఒకరు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అయితే, విపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తారని, రాజయ్య కామెంట్లు చేయడం కలకలం రేపుతోంది. మరో సీనియర్‌ నేత పద్మారావు కూడా అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. మొదటి నుంచీ, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న పద్మారావుకు, డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టినా.. ఆ పదవిపై అయిష్టంగానే ఉన్నట్లు ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు. ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్న తమకు, ప్రాధాన్యత ఇవ్వటం లేదనే భావనలో పద్మారావు ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సీనియర్ నేతలంతా, ఈటల తరహాలోనే ఏదో ఒక రోజు బ్లాస్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదనే చర్చ పార్టీలో జరుగుతోంది.

మొత్తానికి ఈటల రేపిన మంటల స్ఫూర్తిగా ఒకరి తర్వాత మరొకరు అసంతృప్తిగళం వినిపిస్తుండటం... గులాబీ పార్టీలో అగ్గి రాజేస్తోంది. ముఖ్యంగా ఈటల పార్టీపరంగా మాట్లాడితే, రసమయి మరో అడుగు ముందుకేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఏపీ బోర్డు పోయి టీఎస్ వచ్చింది తప్పా... ఏమీ మారలేదంటూ చేసిన కామెంట్స్... అటు పార్టీని... ఇటు ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. మొత్తానికి ఇంతకాలం కేసీఆర్ మాటను జవదాటని నేతలు, ఇప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తుండటంతో టీఆర్ఎస్‌లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీనికి ఒక్కటే కారణంగా తెలుస్తోంది. ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లను అందలమెక్కిస్తున్నారనే అసంతృప్తి రోజురోజుకీ పెరిగిపోతుందని, ఇది ఏదోఒక రోజు అగ్నిపర్వతంలా బద్దలయ్యే ఛాన్సుందని అంటున్నారు.