వలస పక్షులు తిరిగి గూళ్లకు చేరే కాలమొచ్చేసిందా?

ఫిరాయింపులు ఫిరంగి గుండ్లలా తగులుతున్నాయి ఈ మధ్య పార్టీలకి! మరీ ముఖ్యంగా, ప్రతిపక్షంలోని పార్టీలకి తమ నాయకులు ఫిరాయించకుండా చూసుకోటం పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఇందుకు ఈ మధ్య జరిగిన గుజరాత్ రాజ్యసభ ఎన్నికలే మంచి ఉదాహరణ! అక్కడ మొన్నటి దాకా బలంగా వున్న కాంగ్రెస్ ఒకే పెట్టున ఏడేనిమిది మంది ఎమ్మేల్యేల్ని చేజార్చుకోవాల్సి వచ్చింది! శంకర్ సిన్హ్ వాఘేలా లాంటి సీనియర్ కూడా హస్తానికి హ్యాండిచ్చారు! అయితే, గుజరాత్‌లో ఫిరాయింపు బాధలు పడుతోన్న అదే కాంగ్రెస్ తెలంగాణలో గాలం సిద్ధం చేస్తోందని టాక్!

 

2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అదే పనిగా కేసీఆర్ వల విసిరారు. పదుల సంఖ్యలో టీడీపీ, టీ కాంగ్రెస్ నాయకులు గులాబీ కండువాలు కప్పుకున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల హై కమాండ్లు ఏమీ చేయలేక చూస్తూ వుండిపోయాయి. అయితే, గులాబీ బాస్ ఏవో పొలిటికల్ కాలిక్యులేషన్స్ వేసుకుని గెలిచిన ఎమ్మెల్యేల్నే కాదు ఓడిపోయిన వార్ని కూడా తెచ్చి పెట్టుకున్నారు పార్టీలో. అయితే, ఈ వలసలు చాలా చోట్ల ఇప్పుడు వర్కవుట్ కావటం లేదు. వచ్చిన వారు, వున్న వారు మనస్ఫూర్తిగా ఇమడలేకపోతున్నారు. అందువల్ల అధికార పక్షం నుంచీ తిరిగి తమ స్వంతగూళ్లకు చేరే నాయకులు కూడా త్వరలో బయటకు రాబోతున్నారని టాక్!

 

టీఆర్ఎస్ నుంచి తిరిగి ఇతర పార్టీలకు ఎవరు వెళతారో ఇప్పటికైతే క్లారిటీ లేదు. కాని, ఆశ్చర్యకరంగా టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సీటు పొందిన డీఎస్ తిరిగి కాంగ్రెస్ లోకి జంప్ అవుతారని పొలిటికల్ సర్కిల్స్ లో గాసిప్స్ నడుస్తున్నాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా చేసిన ఆయన టీఆర్ఎస్ లోకి వెళ్లటమే పెద్ద ఆశ్చర్యం. ఇప్పుడు మళ్లీ సోనియమ్మతో టచ్ లో వున్న ఆయన 2019ఎన్నికల కోసం కాంగ్రెస్ లోకి వెళతారని అంటున్నారు! దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది!

 

డీఎస్ టీఆర్ఎస్ నుంచి తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లినా, వెళ్లకపోయినా కొందరు నాయకులైతే పార్టీలు మారే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం, నియోజకవర్గాల పెంపుకు కేంద్రం నో చెప్పయేటమేనట. పాత నియోజకవర్గాలే వుంటే టీఆర్ఎస్ లో చాలా మందికి టికెట్లు దొరకటం అనుమానమే. కాబట్టి కాంగ్రెస్ నుంచో, మరో పార్టీ నుంచో హామీ పుచ్చుకుని ప్లేటు ఫిరాయించే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే స్థితి వుంది! అక్కడ కూడా ఇంత కాలం టీడీపీ వైపు ప్రవహించిన వలసల జలమంతా తిరిగి జగన్ కాలువల వైపు యూ టర్న్ తీసుకునేలా వుంది!