కొత్త బంగారులోకం కోసం కలలు కంటున్న కే.సి.ఆర్.

 

తే.రా.స. అద్యక్షుడు కే.చంద్రశేకర్రావు ప్రసంగాలు వింటుంటే ఆయన తెలంగాణా రాష్ట్రంలో తనకి మరే ఇతర పార్టీపోటీ ఉండకూడదనే దోరణిలో ఆయన ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణాలో పాదయాత్రలు చేస్తున్న చంద్రబాబు, షర్మిలలను ఉద్దేశించి అయన చేసిన ప్రసంగంలో సీమాంద్రులయిన వారిపార్టీలను తెలంగాణాలో బోయకాట్ చేయవలసి ఉందని చెప్పడం ద్వారా తెలంగాణాలో మరే ఇతర పార్టీ ఉండకూడదనే తన విపరీతఆలోచనను అయన ప్రసంగం ద్వారా బయటపెట్టుకొన్నారు. గానీ, అయన ఒకప్పుడు అదే పార్టీను సీమంద్ర పార్టీయని తెలిసికూడా ఎన్నికలలో పొత్తులుపెట్టుకొని ఆ నాయకులతో భుజంభుజం కలిపి రాసుకు తిరిగిన సంగతి మరిచిపోవడం చాల విడ్డూరం. అప్పుడు తప్పుగా కనిపించని పార్టీ ఇప్పుడు హట్టాతుగా తప్పుడు పార్టీలెలాయిపోయాయి ఆయనకి? అప్పుడు ఇదేపార్టీలో(తెలుగుదేశం) పనిచేసిన ఆయనకి తమ తెలంగాణా నీళ్ళని దొంగతనంగా ఎత్తుకుపోయిందని అప్పుడు తెలియదా, లేక తరువాత కాలంలో ఏర్పరుచుకొన్న ఎన్నికల పొత్తులరీత్యా చెప్పడం తనకి నష్టం కలుగుతుందని ఆ విషయాన్నీ అప్పుడు లేవననెత్తకుండా ఊరుకోన్నారా? ఆయనే చెప్పాలి.

 

‘సీమాంద్రముద్ర’ వేసి బలంగా ఉన్న ఆ రెండు పార్టీలను బయటకి పంపగలిగితే, ఇక బలహీనమయిన కాంగ్రేసుగానీ, బి.జే.పి.గాని తనకు అడ్డుకాబోవని అయన లెక్క జూసుకొని ఈ విదంగా ప్రయత్నిస్తున్నారా? అయినా, ఇప్పుడు తెలుగుదేశంపార్టీ తెలంగాణాకి తన పూర్తీ మద్దతు ప్రకటించడానికి సిద్దంగాఉన్న ఈతరుణంలో దానిని బయటకి తరమాలని ఆయన పదే పదే ఎందుకు కోరుకొంటున్నారు? ఆ పార్టీలు తెలంగాణాలో తన ప్రాభల్యాన్ని తగ్గిస్తాయని అయన బయపడుతూ ఆ విధంగా జనాన్ని రెచ్చ గోడుతున్నారా?

 

తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే తెలుగుదేశం మరియు ఇతర పార్టీలు కూడా తమ తెలంగాణా శాఖలను ఆరంబించి, వాటిని స్తానిక నేతలోతోనే కదా నడిపించాల్సి ఉంటుంది. ఆ శాఖలు ఉభయరాష్ట్రాల ఉమ్మడిపార్టీ నాయకత్వంలో పని చేయవలసిఉన్నపటికీ, తెలంగాణా సంబందించినంతనవరకు అవి అక్కడి ప్రయోజనాలకే పనిచేయవలసి ఉంటుంది కదా? అటువంటప్పుడు, ఇప్పుడు ‘సీమంద్ర’ ముద్ర వేసి పార్టీలను బయటకి పంపండని ఆయన పిలుపునివ్వడంలో ఔచిత్యం ఏమిటి?

 

ఇప్పటికే ఆయన పలుసభలు, సమావేశాలలో తానూ ఏ ఫైల్స్ మీద తొలిసంతకం పెట్టబోతున్నారో సెలవిచ్చేరు. అంతేగాక, మొన్న జరిగిన ఒక సభలో తాము పక్కనున్న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి, కొంత మంది నిపుణులను పంపి అక్కడి విద్యుత్ కొనుగోలుకు అప్పుడే ప్రయత్నాలు ఆరంభించినట్లు కూడా తెలియజేసారు. అంటే, తనకు తానే అయన తెలంగాణా రాజ్యదికారం కట్టబెట్టేసుకొన్నట్లు అనుకోవాలి. ఇది ఎలా ఉందంటే ‘ఆలులేదు... చూలులేదు.. అల్లుడి పేరు..సోమలింగం’ అన్నరీతిలో ఉంది. రాష్ట్రం ఇంకా ఏర్పడనేలేదు. ఎన్నికలు జరగనూ లేదు. అయినా అప్పుడే అయన తానూ ముఖ్యమంత్రి అయిపోయినట్లు కలలుగంటూ, అదే స్తాయిలో ప్రజలకి వాగ్దానాలు కురిపిస్తున్నారు. తానూ అదే దారిలో పయనిస్తున్నందుకు ఋజువుగా రాబోయే ఎన్నికలలో మొత్తం అన్ని సీట్లకి తమ పార్టీ పోటీ చేయబోతోందని ప్రకటన కూడా చేసేసారు అప్పుడే. అంతే గాకుండా స్వామి గౌడ్ వంటి ఉద్యమంలో తనకి బాసటగా నిలిచినా నేతలకి ఏ ఏ మంత్రి పదవులీయనున్నారో కూడా ప్రకటించేసారు. మరి, తెలంగాణా ఏర్పడితే తోలి ముఖ్య మంత్రిగా ఒక దళితుడనే చేస్తామనే ఆయన మాట సంగతి ఏమిటి?

 

తెలంగాణా ఏర్పడితే ఎన్ని పార్టీలు ఉండాలో, ఎవరు అధికారం చేపట్టాలో కూడా ఆయనే నిర్ణయించడం యెంత వరకు సబబు, సాద్యం? ఒక ఉద్యమ పార్టీగా తే.రా.స.ను స్తాపించిన ఆయన ముందుగా తన గమ్యం అయిన తెలంగాణా సాధన కోసం ప్రయత్నాలు చేయాలి తప్ప, ఈ విదంగా రాజ్యదికారం కోసం వెంపర్లాడకూడదు. రాజకీయంగా ఎదగాలని ఆయన కోరుకోవడంలో తప్పులేదు. గానీ, ఇతరులేవ్వరూ తన రాజకీయ జీవితానికి పోటీ ఉండకూడదని అనుకోవడమే తప్పు. అంతగా వారిని తనఅడ్డు తొలగించుకోదలిస్తే ప్రజాస్వామ్య పద్దతిలో వారిని ఎన్నికలలో ఎదుర్కొని మట్టికరిపించి రాజ్యదికరం దక్కిన్చుకోవచ్చును.

 

‘ప్రజలు మూర్ఖులు వారికీ తాను తెలియజేప్పితే తప్ప వారికి ఏమి అర్ధం కాదు’ అనే తన ధోరణి విడనాడి, ప్రజలు ఎవరికి పట్టం కట్టాలనుకొంటున్నారో వారినే నిర్నయించుకోనీయడం ఉత్తమం. వారే గనుక ఈ సీమంద్రాపార్టీలను వద్దనుకొంటే అప్పుడు ఆయనకే వారు పట్టం కట్టి అధికారం అప్పగించవచ్చు. అదే ఆయనకి గౌరవప్రదం. ప్రజాస్వామ్య దేశంలో యెంత వారికయినా నియంత పోకడలు అభిలషణీయం కాదు.