కేసీఆర్… బీజేపీని టార్గెట్ చేయలేదా? చేసే అవసరం లేదనుకున్నారా?

 

వరంగల్ టీఆర్ఎస్ చేసిన జన సమీకరణ వరదలో మునిగి తేలింది. ఎప్పటిలాగే గులాబీ పార్టీ సత్తాకి ఓరుగల్లు హోరుగల్లుగా మారిపోయి సాక్ష్యంగా నిలిచింది. ఇక కేసీఆర్ మార్క్ ఉపన్యాసంతో ప్రగతి నివేదన సభ సంబురం చేసుకుంది. గులాబీ కార్యకర్తల చేతులు చప్పట్లు కొట్టీ కొట్టీ గులాబీ రంగులోకే మారాయి! కానీ… కానీ… మూడేళ్లు పూర్తి చేసుకున్న తొలి తెలంగాణ సర్కార్ … అసలింత పెద్ద సభకు ఎందుకు పూనుకుంది? ఈ ప్రశ్నలోనే ప్రగతి నివేదనకు బోలెడు కారణాలు కనిపిస్తాయి!

 

కేసీఆర్ వరంగల్ సభలో తమ ప్రభుత్వం చేసిన సంక్షేమం మాత్రమే ఏకరువు పెట్టలేదు. ప్రతిపక్షాల దుమ్ము దులిపారు. మరీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్ కు చెడామడా చీవాట్లు పెట్టారు. పూర్తి స్థాయిలో చవటలు,సన్నాసులు వంటి పదాలు వాడుతూ గులాబీ బాస్ తనదైన స్టైల్లో కోటింగ్ ఇచ్చారు. దీనికంతటికి కారణం ఒక్కటే ఒక్కటి! అయిదేళ్ల కాలంలో ఇప్పుడు సగానికి సగం పూర్తైపోయింది. జనంలోనూ 2014లో వున్న మూడ్ ఇప్పుడు లేదు. అప్పుడున్న ఎమోషన్ కూడా క్రమంగా తగ్గుతోంది. ఇప్పుడు ఆంధ్రా అన్న అస్త్రం ముందులా కేసీఆర్ వాడలేకపోతున్నారు. ఆంద్రా పాలకులు, ఆంధ్రా దోపిడీ లాంటి ఆల్ టైం ఫేవరెట్ పదాలు గతంలో జనం పై పని చేసేవి. కాని, ఇప్పుడు అన్నిటికి, అంతటికీ తెలంగాణ సర్కార్ దే బాద్యత. వచ్చే ఎన్నికల్లో అదే ప్రధానం కానుంది. అందుకే, ప్రగతి నివేదన సభ అవసరమైంది!

 

ప్రగతి భవన్ భారీ ఖర్చుతో సిద్ధం చేయించిన కేసీఆర్ అదే దూకుడు ప్రగతి సాధించటం విషయంలో చూపలేకపోతున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఉద్యోగాలు ఇవ్వకుండా గొర్రెలు, చేపలు ఇస్తామంటున్నారని జనం పుర్రెల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ తనకు వీలైనంత ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వ వ్యతిరేకత పెంచటానికి! అదే సమయంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అనేక విషయాల్లో వెనుకబడుతోంది. 125అడుగుల అంబేద్కర్ విగ్రహం మొదలు దళితులకి మూడెకరాల భూమి వరకూ అన్ని హామీలు, ప్రకటనలు అర్ధాంతర స్థితిలో వుండిపోతున్నాయి. అమలు చేయగలిగేవి , చేయలేనివి అన్నీ త్రిశంకు స్వర్గంలో వుంటున్నాయి. మరో వైపు నుంచీ పదే పదే తెలంగాణ ప్రభుత్వానికి కోర్టుల నుంచీ కూడా రెడ్ సిగ్నల్స్ వస్తున్నాయి. జనంలో ఆ విషయంలో కూడా వ్యతిరేకత పెరిగిపోయే ప్రమాదం లేకపోలేదు!

 

మైనార్టీ రిజర్వేషన్లు, గవర్నమెంట్ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు… ఇలా ఎన్నికలకు ముందే చెప్పినవీ, గొర్రెల పంపిణీ, ఎరువుల పంపిణీ వంటి ముందుగా చెప్పనివీ… అన్నీ ప్రస్తుతానికైతే ఆదికి, అంతానికి మధ్యలో వున్నాయి. ఒకవేళ మోదీ చెబుతున్నట్టు వచ్చే సంవత్సరం చివర్లోనే ఎన్నికలు వచ్చేస్తే వీటిల్లో చాలా హామీలు జనానికి ప్రతిఫలాల రూపంలో అందకపోవచ్చు. అంతలోపే త్వరత్వరగా అమలు పూర్తి చేసి పబ్లిక్ రిజల్ట్ చూపాలి. లేదంటే వాళ్లకు మరో ఆలోచన వచ్చే ఛాన్స్ వుంది. అందుకే, కేసీఆర్ మరోసారి జనానికి భరోసా కల్పించేందుకు వరంగల్ సభ నిర్వహించారు. కాని, ఆ సందర్భంగా ఆయన ఇచ్చిన స్పీచ్ అందర్నీ ఒక్క విషయంలో ఆశ్చర్యపరిచింది!

 

కేసీఆర్ ఎప్పటిలాగే కాంగ్రెస్ ను బలంగా టార్గెట్ చేశారు. టీ టీడీపీని కూడా ఘాటుగానే విమర్శించారు. కాని, అంతా భావించినట్టుగా బీజేపిని మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. ఢిల్లీ నుంచీ మోదీ, అమిత్ షా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో కూడా సత్తా చాటాలని చూస్తున్నా కేసీఆర్ ఎందుకు ఉపేక్షించారు? ఒక కారణం, కమలదళం అమాంతం ఎదిగిపోవటం తెలంగాణలో సాధ్యం కాదు కాబట్టీ…. లైట్ తీసుకోవచ్చు. రెండోది, అనవసరంగా బీజేపిని టార్గెట్ చేస్తే అవసరం లేని ప్రాముఖ్యత ఏర్పడి కాషాయ నాయకులకి ఉపయోగపడవచ్చు! ఈ రెండు కోణాల్లో ఆలోచించి కేసీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలేవీ చేయకపోవచ్చు. ఇక మూడోది … కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీతో ఇప్పట్నుంచే పోరాటం మొదలు పెడితే నిధుల రాబట్టుకోవటం కూడా కష్టమని సీఎం భావించి వుండవచ్చు! ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రస్సే తప్ప బీజేపీ కాదని చెప్పకనే చెప్పారు కేసీఆర్!

 

ముందు ముందు అమిత్ షా వ్యూహాలు ఫలించి బీజేపీలోకి భారీగా వలసలు మొదలైతే టీఆర్ఎస్ మాట తీరు కూడా మారవచ్చు. అంతే తప్ప సాధారణ పరిస్థితుల్లో గులాబీకీ, కమలానికి పెద్దగా పోరాటం జరిగే సూచనలు ఇప్పుడైతే కనిపించటం లేదు. వచ్చే ఎన్నికల్లో వారిద్దరి మధ్యా మైత్రీ మొలకెత్తి టీఆర్ఎస్ ఎన్డీఏలో భాగమైనా ఆశ్చర్యమూ లేదు! ఎందుకంటే, ఒకవైపు రాష్ట్ర బిజేపి నేతలు వ్యతిరేకించిన ఉచిత ఎరువు పథకాన్ని మోదీ మెచ్చుకున్నారట! ఇతర రాష్ట్రాలు కూడా దీనిపై దృష్టి పెట్టాలన్నారట! ఇలాంటి సంకేతాలు కొంత మేర భవిష్యత్ ను సూచిస్తన్నాయి….