వివాదాల్లో బీజేపీ లక్ష్మణ్... ఎందుకొచ్చిన తిప్పలంటూ సెటైర్లు...

తెలంగాణ బీజేపీ నేతలు ఒకరి తర్వాత మరొకరు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎర్రబస్సు మాత్రమే ఎక్కిన తెలంగాణ ప్రజలకు, మోడీ ప్రభుత్వం వచ్చాకే రైలంటే ఏంటో తెలిసిందంటూ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి చేసిన కామెంట్స్ పై విపరీతమైన ట్రోలింగ్స్ జరుగుతుంటే... పిలవని పేరంటానికి వెళ్లి అవమానం పాలవుతున్నారంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ పై సెటైర్లు పేలుతున్నాయి. ప్రత్యర్ధి పార్టీల నేతలే కాదు... సొంత పార్టీ లీడర్లు కూడా లక్ష్మణ్ తీరుపై నవ్వుకుంటున్నారు. పిలవని పేరంటానికి వెళ్తూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ లక్ష్మణ్ నిబంధనలను అతిక్రమిస్తున్నారని అంటున్నారు. కేంద్రమంత్రి హోదాలో తెలంగాణ అధికారులతో కిషన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రతి సమీక్షలోనూ లక్ష్మణ్ పాల్గొనడం వివాదాస్పదమవుతోంది. బైంసా అల్లర్లపైనా... ఆ తర్వాత మెట్రోరైల్ పైనా... ఇప్పుడు చర్లపల్లి శాటిలైట్ రైల్వే స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలోనూ లక్ష్మణ్ పాల్గొనడంపై విమర్శలు రేగుతున్నాయి. అవన్నీ అధికారిక కార్యక్రమాలైతే... లక్ష్మణ్ ఎలా హాజరవుతారని... కిషన్ రెడ్డితో కలిసి సమీక్షల్లో పాల్గొంటారని ప్రశ్నిస్తున్నారు.

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్, మరో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డితో పాటు పలువురు స్థానిక ప్రజానిధులు, రైల్వే ఆఫీసర్లు, ఇటీవల హైదరాబాద్‌లో, రైల్వేకు సంబంధించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ  కార్యక్రమంలో ప్రోటోకాల్‌ ఉంటుంది. అది అందరూ విధిగా ఫాలో అవ్వాల్సిందే. అయితే, అన్నీ తెలిసిన లక్ష్మణ్‌ మాత్రం, కేంద్ర మంత్రులు వస్తున్నారని, రెక్కలు కట్టుకుని, ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రోగ్రామ్‌లో పాల్గొనడంలో తప్పేమీలేదు కానీ, స్టేజి మీద కూర్చున్నారు. మంత్రులు, అధికారులతో కలిసి ఆసీనులయ్యారు. ఇది ప్రోటోకాల్‌కు విరుద్దం. కేవలం ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రమే, వేదిక మీదుండాలన్నది రూల్. రాజకీయాలకు ఏమాత్రం సంబంధంలేని కార్యక్రమం అది. కానీ రాజకీయ పార్టీకి అధ్యక్షుడైన లక్ష్మణ్‌, ప్రోటోకాల్‌ను పట్టించుకోకుండా, స్టేజ్ మీద కూర్చోవడం విమర్శలకు దారి తీసింది.

ప్రోటోకాల్‌ పాటించాల్సిన ప్రోగ్రామ్‌లో పాల్గొనడమే కాకుండా, ఇనాగిరేషన్‌లో సైతం చేయి కలపడం, ఆయన స్థాయిని తగ్గించేలా చేసిందంటున్నారు. లక్ష్మణ్‌ ఇంకా తాను ముషీరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నానని భావించినట్లు ఉన్నారన్న సెటైర్లు పేలుతున్నాయి. అయితే, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తనకు ఆహ్వానం ఉందని చెప్పుకునే ప్రయత్నం చేశారన్న చర్చ జరుగుతోంది. మరి, కార్యక్రమంలో బీజేపీ మాత్రమే ఎందుకుంటుంది...మిగతా పార్టీల నేతలెందుకు లేరన్న ప్రశ్నకు సమాధానం మాత్రం చెప్పడం లేదట లక్ష్మణ్. అయితే, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, వివాదాలకు చాలా దూరంగా వుంటారన్న పేరుంది. తనకుమాలిన విషయాలను అస్సలు పట్టించుకోరని సన్నిహితులంటారు. అలాంటిది, ఇలాంటి లేనిపోని వివాదాలను ఎందుకు కొనితెచ్చుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.