అప్పు తీర్చలేదని మహిళా రైతును ట్రాక్టర్ తో తొక్కించి చంపిన వైసీపీ నేత..

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అప్పు వసూలు కోసం వైసీపీ నేత ఒకరు అరాచకానికి పాల్పడ్డాడు. వడ్డీకి తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదన్న కోపంతో ఓ గిరిజన మహిళా రైతును ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు ఆ దుర్మార్గుడు. గుంటూరు జిల్లా నకరికల్లు శివారులో ఉన్న శివాపురం తండాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు...శివాపురం తండాకు చెందిన గిరిజన దంపతులు రమావత్ మంత్రూ నాయక్, మంత్రుభాయి (55) అటవీ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ రెండున్నర ఎకరాల అటవీ భూములపై వారు హక్కులు సాధించారు. ఐతే సాగు ఖర్చులు, కుటుంబ అవసరాల కోసం అదే మండలంలోని బోనముక్కల శ్రీనివాస రెడ్డి వద్ద రెండేళ్ల కిందట పొలం తాకట్టు పెట్టి రూ.3.80 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఐతే కొంత కాలంగా వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో వారు శ్రీనివాస్ రెడ్డి దగ్గరి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేకపోయారు.

 

దీంతో గత కొన్ని నెలలుగా అప్పుగా ఇచ్చిన సొమ్మును వడ్డీతో పాటు చెల్లించాలని శ్రీనివాసరెడ్డి పట్టుబడుతున్నాడు. అంతే కాకుండా అప్పు చెల్లించనిదే తాకట్టు పెట్టిన భూమిలో అడుగుపెట్టొద్దని హుకుం జారీ చేశాడు. అప్పును కనుక చెల్లించకుంటే తాకట్టుపెట్టిన భూమిని కూడా స్వాధీనం చేసుకుంటానని హెచ్చరిస్తూ వచ్చాడు. ఐతే ఇప్పటికిప్పుడు మా వద్ద అంత డబ్బు లేదు కాబట్టి పొలం అమ్మి అప్పు తీరుస్తాం.. లేదంటే భూమి మీరు తీసుకుని మిగిలిన మొత్తం మాకివ్వండి అని ఆ గిరిజన దంపతులు వేడుకున్నా శ్రీనివాస్ రెడ్డి కనికరించలేదు. ఈ విషయంలో గిరిజన దంపతులకు, అప్పు ఇచ్చిన శ్రీనివాస రెడ్డికి మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో గిరిజన దంపతులు పొలం సాగుచేసేందుకు పొలాల్లోకి రాగా సమాచారం అందుకున్న శ్రీనివాస రెడ్డి ట్రాక్టర్‌తో వారి గ్రామానికి చేరుకుని అప్పు చెల్లించకుండా పొలంలో అడుగుపెడితే ఊరుకోనని హెచ్చరించాడు. ఈ విషయంలో గిరిజన దంపతులకు, శ్రీనివాస్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన శ్రీనివాస రెడ్డి ట్రాక్టర్‌తో మంత్రుభాయిని తొక్కించి వెళ్లిపోయాడు. దీంతో రక్తపు మడుగులో ఆ ముయ్యల రైతు అక్కడికక్కడే కన్నుమూసింది. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదుచేసి ట్రాక్టర్‌తో పాటు పరారీలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. మరో పక్క శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని గిరిజన సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.