ఏపీ ప్రాజెక్టులకు నిధుల కొరత... జగన్ సర్కార్ కు అగ్నిపరీక్ష

 

ఏపీలో సాగునీటి పథకాలకు నిధుల కొరత  కనిపిస్తుంది. ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలంటే లక్షన్నర కోట్లకు పైగా అవసరం ఉంది. ఒక్క పోలవరానికే 32వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వేల కోట్లు బకాయి పడడంతో.. బాకీ ఉన్న బిల్లులను చెల్లించాలంటూ ఓ వైపు కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. సాగు నీటి ప్రాజెక్టుల్లో కొన్ని ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. మరికొన్నింటిని ప్రాధాన్య ప్రాజెక్టులుగా ప్రభుత్వం గుర్తించింది. ఇవి కాకుండా నదుల అనుసంధాన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే అనుకున్నవన్ని సాకారం కావాలంటే గల్లాపెట్టె సహకరించాలి. కానీ కాసులకు కటకటలాడే పరిస్థితి ఉండటంతో..ఇన్ని ప్రాజెక్టులను ఎలా కట్టాలో తెలియని పరిస్థితులు సాగునీటి శాఖలో నెలకొన్నాయి. ప్రాజెక్టు ముందుకు కదలడం ప్రశ్నార్ధకరంగా మారింది.

రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే రూ.1,64,915 కోట్లు అవసరమవుతాయని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో పోలవరం సాగు నీటి ప్రాజెక్టు కోసం 32,498 కోట్లు అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టక ముందు పలు సాగు నీటి ప్రాజెక్టులకు చెల్లించాల్సిన బిల్లుల బకాయిలు వేల కోట్లు ఉన్నాయి. వాటిని చెల్లిస్తేనే పనులు మొదలు పెడతామని కాంట్రాక్టు సంస్థలు తేల్చి చెప్పాయి. వాటిని తీర్చే పరిస్థితి ప్రభుత్వానికి లేకపోవటంతో ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సీఎం సూచించిన ప్రాధాన్య ప్రాజెక్టుల పనులకు టెండర్లు పిలిచి పనులు అప్పగించాలంటే నిధులు కావాలి. ఖజానాల్లో నిధులు అట్టడుగుకు చేరుకున్నాయి. దీంతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలన్న ఆలోచనలో జల వనరుల శాఖ ఉంది. కానీ సాగు నీటి పథకాలకు నిధులు ఇచ్చేందుకు వాణిజ్య బ్యాంకులు ముందుకు రావటం లేదు. వీటి నిర్మాణం వల్ల ఖజానాకు వచ్చే ఆదాయం ఉండదని బ్యాంకులు భావిస్తున్నాయి. అందువల్ల బకాయిలు తిరిగి చెల్లించే పరిస్థితి ప్రత్యేక కార్పొరేషన్ కు సాధ్యం ఉండదనే  అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆర్ధిక వనరులు అంతంత మాత్రమే ఉన్నా.. భారీ ప్రాజెక్టులకు సీఎం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గోదావరి జలాలను బానకచర్లకు ఎత్తిపోయడం ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్న పధకానికి డిపిఆర్ ను సిద్ధం చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్ కు జల వనరుల శాఖ అప్పగించింది. ఈ పథకానికి 64 కోట్ల వరకు వ్యయమవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నా.. ఇది రెట్టింపు అయ్యే పరిస్థితి ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టే ప్రాధాన్యత సాగు నీటి ప్రాజెక్టుల కోసం తక్షణమే కృష్ణా డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ పరిధిలో 30,108 కోట్లు, అనంతపురం చీఫ్ ఇంజనీర్ పరిధిలో 21,663 కోట్లు, కర్నూలు చీఫ్ ఇంజనీర్ పరిధిలో 20,039 కోట్లు, పోలవరం ప్రాజెక్టు ఈఎన్సీకి 14,546 కోట్లు, చీఫ్ ఇంజినీర్ కడప పరిధిలో 4,276 కోట్లు అవసరం అవుతాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను విస్తరించి బానకచెర్ల రిజర్వాయర్ కాంప్లెక్స్ కు 80,000 క్యూసెక్కులను శ్రీశైలం నుంచి పంపించే పథకాన్ని 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 2021 నాటికి అవుకు టన్నెల్ లో పూర్తి చేయాలనుకుంటున్నారు. వంశధార ప్రాజెక్టు పనులను 2022 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పనులు చేపట్టేందుకు నిధుల జాడ కూడా కనిపించటం లేదు.