రంగంలో అగ్రనేతలు..ఏకంగా ఇంటికే వెళ్తున్నారు

 

నామినేషన్ల ఉపసంహరణకు నేడు ఆఖరి గడువు కావటంతో రెబల్స్ ని బుజ్జగించే పనిలో పడ్డారు అన్ని పార్టీల నేతలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్ గా బరిలోకి దిగిన నేతలను బుజ్జగించేందుకు ఆ పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను   అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీ ఒక్క సీటును కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకే, తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించడానికి అహ్మద్‌ పటేల్‌,జైరాం రమేశ్‌, వీరప్ప మొయిలీ,డీకే శివకుమార్‌ వంటి హేమాహేమీలు దిగి వచ్చారు. వారు అసమ్మతి నేతల ఇంటికి నేరుగా వెళ్లి బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

శేరిలింగంపల్లిలో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి భిక్షపతి యాదవ్‌ను బుజ్జగించడానికి ఏకంగా ఆరుగురు అగ్ర నేతలు ఆయన ఇంటికి వెళ్లారు. ఇప్పటికే భిక్షపతి యాదవ్‌ను  జైపాల్‌రెడ్డి కలిశారు. నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని కోరగా.. ఆయన ససేమిరా అన్నారు. దాంతో  ఏఐసీసీ కోశాధికారి అహ్మద్‌ పటేల్‌, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ, సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ తదితరులు భిక్షపతి యాదవ్‌ ఇంటికి వెళ్లి నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని బుజ్జగించారు. ఉన్నతమైన స్థానం ఇచ్చి గౌరవమిస్తామని హామీ ఇచ్చారు.అగ్రనేతలు రావటంతో భిక్షపతి కూడా మెత్తబడ్డారు. పెద్దలు మాట్లాడిన తీరు, ఇచ్చిన హామీ తనను సంతృప్తిపరిచాయని, నామినేషన్‌ను ఉపసంహరించుకుంటానని తెలిపారు. 

మరోవైపు మేడ్చల్‌ నుంచి రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన జంగయ్య యాదవ్ ను బుజ్జగించేందుకు జైరాం రమేశ్‌ ఆయన ఇంటికి వెళ్లారు. పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. దీంతో నామినేషన్‌ ఉపసంహరించుకుంటానని జంగయ్య యాదవ్‌ తెలిపారు. మల్కాజిగిరి నుంచి నామినేషన్‌ వేసిన సురేశ్‌ యాదవ్‌తో వీరప్ప మొయిలీ మాట్లాడారు. ఆయన కూడా పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఖైరతాబాద్‌ నుంచి నామినేషన్‌ తిరస్కరణకు గురైన రాజు యాదవ్‌.. తాను దాసోజు శ్రవణ్‌కు మద్దతుగా పనిచేస్తానని తెలిపారు. సూర్యాపేటలో నామినేషన్‌ వేసిన పటేల్‌ రమేశ్‌ రెడ్డి కూడా ఉపసంహరణకు అంగీకరించారు.

పొత్తుల్లో భాగంగా సనత్‌నగర్‌ సీటును కోల్పోయిన మర్రి శశిధర్‌ రెడ్డి నివాసానికీ జైరాం రమేశ్‌ వెళ్లి సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. మరోవైపు రేవంత్‌తో సమావేశమైన జైరాం... సోనియా సభ ఏర్పాట్లు, అసంతృప్తుల బుజ్జగింపులపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రెబల్స్‌ అందరూ నామినేషన్లు ఉపసంహరించుకుంటారని పార్టీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. మొత్తానికి అగ్రనేతలు దిగి రావటంతో బుజ్జగింపులు కొలిక్కి వచ్చాయి. రెబల్స్‌ను బుజ్జగించడానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలు ఏకంగా వారి ఇళ్లకే వెళ్లడం ఆ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి అని కాంగ్రెస్‌ సీనియర్లు చెబుతున్నారు.