పూరీ జగన్నాథ్.. ఆ విషయాన్ని గ్రహించాలి!

నిందితుడిపై అభియోగం రుజువైతే... అప్పుడు నేరస్తుడవుతాడు. ఈ చిన్న లాజిక్ కూడా మరిచిపోయి బిహేవ్ చేస్తున్నాయ్ కొన్ని ఛానళ్లు. నిందితులు నేరస్తులో కాదో తేల్చాల్సింది కోర్టులు. కానీ... మన ఛానళ్లే తీర్పులిచ్చేస్తున్నాయ్. ఇది ఇప్పటి పరిస్థితి. పదే పదే చెబితే... నిజం కూడా అబద్ధం అవుతుందీ... అబద్ధం కూడా నిజం అవుతుంది. సో... ఇలాంటి విషయాల్లో కాస్త ఎవరికైనా సంయమనం అవసరం. 

 

డ్రగ్స్ మాఫియా ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ రాలేదు. చాలా ఏళ్లుగా ఇక్కడ వేళ్లూనుకుంది. గతంలో కూడా ఇలాంటి ఎలిగేషన్స్ కొంతమంది సెలబ్రిటీలపై వచ్చాయి. కానీ... తర్వాత నీరు కారిపోయాయి. అలా ఎందుకు జరిగిందో.. ఇప్పుడు అప్రస్తుతం. మేం చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే... డ్రగ్ మాఫియా మూలాలను కూకటి వేళ్లతో పెకిలించే దిశగా అటు చట్టంగానీ, ఇటు మీడియా కానీ... అడుగులు వేయాలి. అంతే కానీ...  సినీరంగంలో కొంతమంది దొరికే సరికి వారి పైనే ఫోకస్ మొత్తం పెట్టి... వారని మాత్రమే బదనాం చేసే పనిలో పడటం. దాన్ని సుదీర్ఘంగా కొనసాగించడం  సరికాదు. 

 

ఒక్క సినిమా రంగంలోనే కాదు, ప్రముఖ రాజకీయ నాయకుల పిల్లలు, వ్యాపారవేత్తల పిల్లలు, విద్యార్థలు, బడా నేతలు... ఇలా చాలామంది డ్రగ్ మాఫియాకు బలైపోయారు. మరి అలాంటప్పుడు ఆ మిగిలిన వారి గురించి ఎందుకు ఆలోచించరు. పొద్దున లేచిన దగ్గర్నుచీ, దర్శకుడు పూరీ జగన్నాథ్ అండ్ టీమ్  పైనే మీడియా అంతా వెళ్లిపోతోంది. ఒక వేళ వీళ్లు డ్రగ్స్ తీసుకుంటున్నది నిజమే అయితే... పూరీ, ఛార్మీ, సుబ్బరాజు, శ్యామ్ కె.నాయుడు, నందు, తరుణ్, నవదీప్, తనీష్... వీళ్లందరూ కేవలం బాధితులు మాత్రమే. నేరస్థులు కాదు.  వీళ్లకు కావాల్సింది కౌన్సిలింగ్.  ఆ డ్రగ్స్ సప్లయ్ చేసిన వాళ్లు నేరస్తులు. వాళ్లకు పడాలి శిక్ష. 

 

నిన్న పూరీ..  సిట్ కార్యాలయంలో హాజరయ్యాడు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. పది గంటలు జరిగిన విచారణలో కొన్ని కీలకమైన విషయాలను కూడా బయటపెట్టినట్టు మీడియాలో వినిపిస్తుంది. మరి ఆ సమాచారం మీడియాకు ఎలా తెలిసింది? ఈ ప్రశ్నకు సమాధానం సదరు ఛానల్స్ వారే చెప్పాలి. అయితే పూరీ మాత్రం తన ట్విట్టర్ ద్వారా మీడియా తీరుపై అభ్యంతరం వెలిబుచ్చుతూనే... ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ దశలో ‘మా జీవితాలు నాశనం చేశారు’అని మీడియాపై నిప్పులు కక్కాడు. తనకు పోలీసులంటే ఇష్టమని, అందుకే పోలీస్ నేపథ్యంలో చాలా చిత్రాలు తీశానని, అలాగే మీడియాపై ఉన్న గౌరవంతో ‘ఇజం’సినిమా తీశానని, మీడియాలో తనకు చాలామంది మిత్రున్నారనీ, కానీ... వారే తన జీవితాన్ని నాశనం చేశారనీ పూరీ ట్విట్టర్ ద్వారా వాపోయాడు. 

 

కానీ... ఇక్కడ పూరీ కూడా గ్రహించాల్సిన విషయం ఒకటుంది. మీడియా తన గురించి నెగిటీవ్ గా ప్రచారం చేస్తున్నా... సోషల్ మీడియా మాత్రం తనకు అండగా నిలిచింది. పూరీ ట్విట్టర్ లో పెట్టిన వీడియోకి లక్షల్లో లైక్ లే కాకుండా, కామెంట్ల ద్వారా అందరూ పాజిటీవ్ గా స్పందిస్తున్నారు. అంతేకాదు... ఆ విడియోకి వేలల్లో షేర్లు చేస్తున్నాయి కూడా. ఎవరి అభిప్రాయం వారు నిస్కర్షగా చెప్పగలిగే సాంఘిక మాధ్యమం అండగా ఉన్నంతవరకూ... పూరీ భయపడాల్సిన అవసరం లేదు. 

 

ఇకనైనా... అనవసరమైన వాటి గురించి ఆలోచించకుండా... చెడు వ్యసనాలను దూరంగా పెట్టి.. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన సినిమా గురించి ఆలోచించడం మొదలుపెడితే... పూరీ మళ్లీ పాత వైభవాన్ని చూస్తాడు. ఎందుకంటే... దర్శకునిగా అతని ప్రతిభ అలాంటిది. పూరీకి గానీ... మిగిలిన అభియోగ దారులకు కానీ... ఇప్పుడు ఏర్పడ్డ గాయం నయం కావాలంటే... దానికి ఒక్కటే మందు ‘సక్సెస్’. తప్పు చేస్తే పశ్చాత్తపపడండి. కొని తెచ్చుకున్న కష్టాలను అధిగమించి... మంచి హిట్ కొట్టేయండి. అన్ని సర్దుకుంటాయ్. 

 

-నరసింహ బుర్రా