తెలుగు చిత్ర పరిశ్రమకు ఇది తీరని అవమానం

తెలుగు సినిమా తల్లి విలపిస్తున్న సమయం ఇది. 

తెలుగు సినిమాను సుసంపన్నం చేసిన మహనీయుల ఆత్మలు రోదిస్తున్న సమయం ఇది.

కుటీర పరిశ్రమగా ఉన్న సినీ పరిశ్రమను ఓ మహా పరిశ్రమగా తీర్చిదిద్దడానికి ఎంతమంది మహా కళాకారులు ఎంత కష్టపడ్డారో చెప్పాలంటే... ఓ పెద్ద గ్రంధమే అవుతుంది. వాళ్లు నడిచిన రాళ్ల, ముళ్ల బాటలే... ఈ రోజున ఇప్పడు ఎదుగుతున్న కళాకారుల సుఖమయ ప్రయాణానికి మార్గాలయ్యాయి. ఈ విషయాన్ని మరచిపోయి... నైతిక విలువలకు తిలోదకాలిచ్చి.. మాదక ద్రవ్యాల బారిన పడి, తెలుగు సినిమా ఔన్నత్యాన్ని కాలరాస్తున్నారు ప్రస్తుతం కొందరు వ్యక్తులు. 

 

1932లో ‘భక్తప్రహ్లాద’తో మొదలైన తెలుగు సినిమా...  అక్కినేని, నందమూరి ఆగమనంతో కొత్త రూపు సంతరించుకుంది. క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచి 35 ఏళ్ల పాటు తెలుగు సినిమాను వినూత్న శోభను తెచ్చిపెట్టారు ఎన్టీయార్, ఏఎన్నార్. వేలల్లో ఉన్న తెలుగు సినిమా మార్కెట్ ని కోటి రూపాల స్థాయికి పెంచి...  కోట్లాది మందికి ఆసరానిచ్చే గొప్ప పరిశ్రమ స్థాయికి తీసుకెళ్లారు. 

 

వారి తర్వాత తరం వారైన కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్, మురళీమోహన్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తదితర స్టార్లు కూడా అదే క్రమశిక్షణతో తెలుగు సినిమాను మరింత ఎత్తులో నిలిపారు. నాటి సినీ సాంకేతిక నిపుణులు కూడా తెలుగు సినిమాపై ప్రజల్లో గౌరవాన్ని పెంచాలా చేశారు. 

 

కానీ ఇప్పటి తరంలో కొందరు అందుకు పూర్తి విరుద్దం. చేసే పని గురించి ఆలోచించకుండా...దురలవాట్లు బానిసవడమే కాక... మాదక ద్రవ్యాల బారిన పడి.. తమ జీవితాలని పాడు చేసుకోవడమే  కాక, చిత్ర పరిశ్రమకు కూడా మచ్చను తెచ్చిపెడుతున్నారు. దానికి నేడు జరుగుతున్న ఉదాంతమే నిదర్శనం. 

 

ఒకడు అలవాటు చేసుకోవడం... దాన్ని ఇంకొకడికి నేర్పడం... ‘అలా... తా చెడ్డ కోతి వనం మొత్తం చెరిచింది’ అన్న చందాన.. అందరికీ ఆ గజ్జిని అంటించడం .. ఇది నేటి సినీరంగానికి చెందిన కొందరు వ్యక్తుల పరస్థితి. ఇలాంటి వారికి సినిమాలుండవ్. అందుకే డబ్బు కోసం వీరు ఎంచుకునే మార్గం ‘పబ్ ’. డబ్బు  వరదలై పారే నేటి సినీ పరిశ్రమలో... సరదాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. దానికి ఎక్కువ మంది ఆశ్రయించేది పబ్ లకే. అందుకే.. సినీ రంగానికి చెందిన వారే ‘పబ్’ లు తెరుస్తారు. అక్కడే మాదక ద్రవ్యాలు... తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతుంటాయ్. 

 

మరీ ఇంత దారుణమా? 

 

మాదకద్రవ్యాలను విక్రయించే విదేశీయుడు ‘కెల్విన్’... హైదరాబాద్ పోలీసులకు పట్టుబడటంతో డొంక కదిలింది. వాడిని నాలుగు తగిలించే సరికి... వరుసగా... పూరీ జగన్నాథ్, రవితేజ, నవదీప్, తరుణ్, చార్మీ, ముమైత్ ఖాన్, శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, నటుడు నందు, తనిష్, సుబ్బరాజు... ఇలా డ్రగ్స్ కి అలవాటు పడి, తన దగ్గర డ్రగ్స్ కొనుక్కుంటున్న అందరి పేర్లూ చదివాడు. ఇక మీడియా ఊరుకుంటుందా రచ్చ రంబోలా చేసింది. 

 

తెలుగు సినిమాకే మచ్చ తెచ్చిన ఇలాంటి వారిని ఏం చేయాలి? అని పరిశ్రమకు చెందిన వారు అనుకుంటుంటే... ‘సినిమా పరిశ్రమ అంటే..ఇంతేరా...’అంటూ ఎగదాళిగా మాట్టాడుకుంటున్నారు అందరూ. 

 

మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19 నుంచి 27వ తారీకు లోపు తమంట తాము వచ్చి లొంగిపోతే సరి. లేకపోతే... నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సివస్తుందని తెలంగాణ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వార్నింగ్ కూడా జారీ ఇచ్చేవారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీస్ అయిద ఫ్లోర్ లో వీరందరూ లొంగిపోవాలి.  

 

శుక్రవారం సాయంత్రం లోపు ఓ సినిమా ప్రముఖుణ్ణి అరెస్ట్ చేసే అవకాశం ఉందని టాక్. ఇది నిజంగా చిత్ర పరిశ్రమకే తీరని అవమానం. గతంలో కూడా ఇలాగే కొందరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు జరిగిన ఈ అల్లరి గతంలో కూడా ఓ సారి జరిగింది. అయితే.. పోలీసులు, నాయకులు గడ్డి తినడంతో ఆ అల్లరి ఎవరూ ఊహించకుండా సద్దుమణిగిపోయింది. కానీ... ప్రస్తుత తెలంగాణ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మాత్రం ఇలాంటి విషయల్లో మడమ తిప్పని మనిషి. అందుకే ఇప్పుడు ఆటలు సాగడం లేదు.