టాలీవుడ్‌ పరువు పోతోందో

 

భారతదేశంలో తెలుగు పరిశ్రమ ప్రత్యేకత గురించి మళ్లీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ అదేంటో, ఎన్ని వందల సినిమాలు తీసినా తెలుగు చిత్రాన్ని ‘సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌’గానే చూసేవారు. తమిళ, మలయాళ సినిమాలకి ఉన్నంత గుర్తింపు తెలుగు చిత్రాలకి వచ్చేది కాదు. బాహుబలి పుణ్యమా అని ఒక్కసారిగా టాలీవుడ్‌ వైపు దేశం చూపు తిప్పింది. జక్కన్న ప్రతిభ ప్రపంచాన్నే తలతిప్పేలా చేసింది. మరి ఆ దిష్టి తగిలిందో ఏమో కానీ... గత కొద్ది నెలలుగా టాలీవుడ్‌ లేనిపోని అపవాదులతో తలంటుకుంటోంది.

ముందు శ్రీరెడ్డి రూపంలో తెలుగు పరిశ్రమకి భారీ షాక్‌ తగిలింది. నిజమో, అబద్ధమో... తెలుగునాట క్యాస్టింగ్ కౌచ్‌ ఉందంటూ శ్రీరెడ్డి చిన్నచిన్న ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టింది. అవకాశాలిస్తామని తనని వాడుకున్నారంటూ దుమ్మెత్తిపోసింది. తాను మోసపోయానన్న భావనలో ఉన్న శ్రీరెడ్డి ఎలాగైనా పరిశ్రమ మీద పగ తీర్చుకోవాలనే తలపుతో ఉన్నట్లు అర్థమైపోయింది. ఇలాంటి సమయంలో పరిశ్రమ పెద్దలు ఎవ్వరూ ఆమె మాటల్ని పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. పైగా ఇలాంటివి అసలు జరగనేలేదంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించడం మానేసి... ఆమెతో నటించేవాళ్లని సైతం వెలి వేస్తాం అంటూ ఓ చిత్రమైన నిబంధన పెట్టారు. శ్రీరెడ్డి నడిరోడ్డు మీద నగ్నంగా నిలబడేందుకు, ఈ నిర్ణయం ఎగదోసినట్లయ్యింది. శ్రీరెడ్డి చర్యతో ఏకంగా టాలీవుడ్ పరువే నగ్నంగా నిలబడిపోయింది.

న్యూస్‌ కోసం నోరు తెరుచుకుని ఉండే మీడియాకు శ్రీరెడ్డి వార్త విందు భోజనంలా మారిపోయింది. దాన్ని వడ్డించి, వర్ణించి వాళ్లు టాలీవుడ్‌ మొఖానికే మసిపూసే ప్రయత్నం చేశారు. ఏకంగా మెగా కుటుంబమే ఫిల్మ్‌ ఛాంబర్ల దగ్గర గొల్లుమనేలా చేశారు. ఇప్పటికీ శ్రీరెడ్డి వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. ఒకరి తర్వాత ఒకరిని ఆమె టార్గెట్‌ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఎవరి పేరు చెబుతుందోనని గింజుకోవడం తప్ప, టాలీవుడ్‌ పెద్దలు చేస్తోందేమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీరెడ్డి విషయంలో ఎలా వ్యవహరించాలో ‘మా’ అసోసియేషన్ దగ్గర ఒక ప్రణాళికే లేదు. ఆ తుపాను తగ్గిపోయేదాకా తలవంచుకుని ఉండాలనే వాళ్లు నిర్ణయించుకున్నట్లున్నారు. అలాంటప్పుడు ఇక అసోసియేషన్ ఎందుకో!

శ్రీరెడ్డి వ్యవహారంలో తలమునకలైన టాలీవుడ్‌కి ఈసారి ఏకంగా అమెరికాలోనే అవమానం ఎదురుచూసింది. కిషన్ మోదుగుమూడి అనే మహాశయుడు సతీసమేతంగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తూ పట్టుబడ్డాడు. అవకాశాలు రాని, లేని తారలకు వలవేసి అమెరికాకి రప్పించి వాళ్లకి నామమాత్రపు రుసుములు ఇప్పించి వ్యభిచార దందాని నిర్వహిస్తున్నట్లు బయటపడ్డాడు. ఈ వార్త వెలుగులోకి రాగానే మీడియా పులుల మరోసారి విజృంభించాయి. అక్కడి పోలీసులు ఐదుగురు హీరోయిన్ల పేర్లను ఛార్జిషీటులో పేర్కొన్నారని గాండ్రించి మరీ చెప్పాయి. వాళ్లలో కన్నడ హీరోయిన్‌ ఒకరు, పెద్ద హీరో సరసన నటించిన హీరోయిన్‌ ఒకరు, మూడు అక్షరాల పేరు ఉన్న హీరోయిన్‌ ఒకరు, ప్రముఖ యాంకర్‌ ఒకరు... అంటూ రకరకాల క్లూస్‌ ఇచ్చి జనాలని ఊరించాయి.

ఒక పత్రికతో మాట్లాడుతూ ‘కిషన్ మోదుగుమూడి’ మీద తమకి మొదటి నుంచే అనుమానం ఉన్నట్లు అసోసియేషన్ అధ్యక్షులవారు పేర్కొన్నారు. మరి అనుమానం ఉంటే ఇన్నాళ్ల నుంచి ఏం చేస్తున్నట్లు? పైగా ఇక మీదట విదేశాలకి వెళ్లేవారు జాగ్రత్తగా వ్యవహరించాలనీ సూచిస్తున్నారు. మరోవైపు కిషన్ మోదుగుమూడి తమని కూడా అప్రోచ్‌ అయినట్లు కొందరు నటీమణులు చెప్పుకొచ్చారు. మరి వాళ్లు ఇప్పటిదాకా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు. ఇదంతా చూస్తుంటే కిషన్ లీలలు అందరికీ తెలిసే జరుగుతున్నాయని అర్థమవుతోంది. కాకపోతే దీన్ని వ్యక్తిగత విషయంగా భావిస్తూ వచ్చి ఉంటారు. మన పరువు ఏకంగా అమెరికాలో పోయాక కానీ భుజాలు తడుముకుంటూ బయటకి రావడం లేదు.

చివరగా చెప్పుకొనేదేంటయ్యా అంటే... టాలీవుడ్‌లో ఎదురయ్యే సమస్యలను నిర్భయంగా ఎదుర్కొనే స్థైర్యం కానీ, వాటికి పరిష్కరించే పరిణతి కానీ కనిపించడం లేదు. దాసరివంటి వారు లేని లోటు కనిపిస్తోందని పదిమందీ పదేపదే బాధపడుతున్న కారణం ఇదే! కుర్రవాడైనా కూడా తమిళనాట ఎలాంటి సమస్యనయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న విశాల్‌ని చూసైనా మన పెద్దలు ఏమన్నా నేర్చుకుంటారేమో చూడాలి!