డ్రగ్స్ మత్తులో తూగుతున్న టాలీవుడ్ సెలబ్రిటీస్‌..?

డ్రగ్స్ … ఇప్పుడు హైద్రాబాద్ ను పదే పదే ఉలికిపాటుకి గురి చేస్తోన్న విషయం! మొన్నటికి మొన్న పోలీసులు డ్రగ్స్ దందాపై ఆందోళనకర అంశాలు బయటపెట్టారు. పెద్దవారు, కాలేజీ పిల్లలు కాదు… స్కూలు పిల్లలు కూడా డ్రగ్స్ బారిన పడి అల్లాడుతున్నారని వారు చెప్పారు! స్కూల్ యాజమాన్యాలను అలెర్ట్ చేసి పిల్లల తల్లిదండ్రుల్ని కూడా అప్రమత్తం చేశారు. అయితే, ఇవాళ్ల డ్రగ్స్ వ్యవహారంలోకి టాలీవుడ్ కూడా వచ్చిపడింది! తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ముగ్గురు యువ హీరోలు, నలుగురు దర్శకులు, ఇద్దరు నిర్మాతలు, ఒక స్టంట్ మాస్టర్ కు నోటీసులు వెళ్లాయి. వారంలోగా విచారణకు హాజరుకావాలని అదేశించారు పోలీసులు…

 

సినిమా వాళ్లు డ్రగ్స్ వాడటం పెద్ద కొత్త విషయమేం కాదు. గతంలో హీరో రవితేజ తమ్ముళ్లు, హీరో నవదీప్ లాంటి వారు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎవరు వాడారో ఎవరు వాడలేదో స్పష్టంగా తెలియనప్పటికీ కొందరి పేర్లు డ్రగ్స్ చర్చల్లో పదే పదే వినిపిస్తూనే వుంటాయి. కాని, ఇండస్ట్రీ ఎప్పుడూ వార్ని సీరియస్ గా తీసుకోలేదు. కాని, తీరా నోటీసులు వచ్చాక ఇవాళ తెలుగు సినిమా పెద్దలు ప్రెస్ మీట్‌ పెట్టి వాపోయారు. తీరు మార్చుకోవాలని అన్నారు. కొందరి వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందని బాధపడ్డారు. కాని, అసలు ఇండస్ట్రీలో ఎవరెవరు డ్రగ్స్ వాడతారన్నది, ఎవరు సప్లై చేస్తుంటారన్నది పబ్లిక్ సీక్రెట్! అలాంటప్పుడు వారిని పరిశ్రమ ఎందుకు ఎంటర్‌టైన్ చేస్తున్నట్టు!

 

చాలా కాలంగా డ్రగ్స్ సప్లై, వాడకం టాలీవుడ్లో బాగా పెరిగిపోయింది. ఎవరు వాడుతున్నారన్నది సామాన్య జనానికి తెలియకపోయినా లోపలి వారందరికీ బాగానే తెలుసు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోనీ ఇప్పుడు నోటీసులు ఇచ్చిన ఎక్సైజ్ శాఖన్నా సదరు సెలబ్రిటీల్ని పబ్లిక్ ముందుకి తెచ్చిందా అంటే అదీ లేదు! ముగ్గురు హీరోలు, నలుగురు దర్శకులు అంటే … జరిగేది శూన్యం. సోషల్ మీడియాలో ఎవరికి తోచినట్టు వారు ఊహాగానాలు చేస్తారు. ఆ హీరో అని, ఈ డైరెక్టర్ అని చెప్పుకుంటారు. అంతే తప్ప నిజమైన తప్పు చేసిన వారు జనం ముందుకి వచ్చే ఛాన్సే లేదు. విచారణకి వచ్చినప్పుడు సైతం వారి వారి పేర్లు బయటకొస్తాయని గ్యారెంటీ లేదు.

 

డ్రగ్స్ వాడిన వారి ఐడెంటిటి సీక్రెట్ గా వుంచటంలో తప్పు లేదు. కాని, ఇండస్ట్రీలోని వారికి అన్నిటికంటే ఎక్కువ భయం ఇమేజ్ మీదే వుంటుంది. కాబట్టి డ్రగ్స్ వాడే వారికి అసలైన పన్మిష్మెంట్ వారి పేర్లు భయపెట్టడమేనంటున్నారు కొందరు నిపుణులు. అలా అయితేనే భవిష్యత్ లో వారు తప్పు చేయకుండా వుంటారని అంటున్నారు. వేరే వాళ్లు కూడా డ్రగ్స్ వాడకం లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జోలికి వెళ్లరంటున్నారు. పోలీసులు ఈ కోణంలోనూ ఒక సారి ఆలోచించాలి…

 

గతంలో ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్ ప్రముఖులకి నోటీసుల దాకా వచ్చిన డ్రగ్స్ వ్యవహారం చివరి దాకా చల్లబడకుండా సాగాలని కోరుకుందాం. ఎందుకంటే, డ్రగ్స్ వాడే పెద్ద చేపలు వలలో పడితే చిన్న చిన్నవి జాగ్రత్తపడతాయి. వాడే వారు లేకుంటే డ్రగ్స్ సప్లై చేసే వారు కూడా వుండరు. అంటే… దీర్ఘ కాలంలో డ్రగ్స్ సమస్య పరిష్కారానికి సెలబ్రిటీల్ని బోనులో నిలపటం ప్రభావవంతమైన మార్గం అని చెప్పవచ్చు!