మా పార్టీ తరపునే పోటీ చేస్తాం--కోదండరాం

 

తెరాసను గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో తెదేపా, సీపీఐ, తెజస మహా కూటమిగా ఏర్పాటైన విషయం తెలిసిందే.ఇప్పటికే పలుమార్లు భేటీలు జరిగినప్పటికీ సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి రాలేదు. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపైన ప్రధానంగా దృష్టిపెట్టిన కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేశారు.తెరాస అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా.. కాంగ్రెస్‌ సీట్ల సర్దుబాటుపై ఇంకా ఎటూ తేల్చకపోవడంతో కూటమికి నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఇటీవల కోదండరాం కూడా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా మరో మారు కాంగ్రెస్‌, తెజస నేతల మధ్య కీలక భేటీ జరిగింది.

లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో మహాకూటమి సీట్ల సర్దుబాటుపై తెజస, కాంగ్రెస్‌ ముఖ్య నేతలు భేటీ అయ్యారు.ఈ భేటీలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్  కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సహా తెజస అధ్యక్షుడు కోదండరాం, దిలీప్‌ కుమార్‌ పాల్గొన్నారు.కూటమిలోని ఏయే పార్టీలకు ఎన్నిసీట్లు ఇవ్వాలనే అంశంపై చర్చించారు. భేటీ అనంతరం కోదండరాం మాట్లాడుతూ తాము కాంగ్రెస్‌ గుర్తుపై పోటీచేయబోమని స్పష్టంచేశారు.పొత్తులపై రెండు రోజుల్లో పూర్తి అవగాహన వస్తుందని చెప్పారు.ఎన్నికల సంఘం నుంచి తమ పార్టీకి గుర్తింపు వచ్చిందని, త్వరలోనే తమ పార్టీకి గుర్తు కూడా వస్తుందని వివరించారు.తమ పార్టీ గుర్తుమీదే తమ అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టంచేశారు.చర్చలు జరుగుతున్న దశలో వివరాలు బయటకు వెల్లడించడం సరికాదన్నారు. అయితే 16 సీట్లకు తెజస పట్టుబట్టగా..తొమ్మిది సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది.