టీటీడీ చెలగాటం… టీడీపీకి ప్రాణ సంకటం!

మహాసంప్రోక్షణ మహావివాదం ఒక్క మాటతో ముగిసింది. చంద్రబాబు కలుగజేసుకుని భక్తులకి నిత్యం దర్శనాలు కల్పించాల్సిందేనని అదేశించటంతో టీటీడీ బోర్డు నిర్వాకం మరింత దుమారం కాకుండా ఆగిపోయింది. అయితే, అసలు ఇంత వరకూ పరిస్థితి రాకుండా వుంటే ఇంకా బావుండేదని మాత్రం చెప్పుకోవాలి. ఇదంతా సీఎంపైనా, అధికార పార్టీపైనా అనవసర రాద్ధాంతానికి మూలమైంది. కేవలం టీటీడీ బోర్డు వారి అనాలోచిత నిర్ణయం పెద్ద గొడవకి తెర తీసింది.

 

 

ఎన్నికల ముందు సంవత్సరం అంటే అధికార పక్షం డిఫెన్స్ లో సాగుతుంటుంది. అపోజిషన్ దూకుడుగా ఆడుతుంది. ఈ విషయం తెలియని వారు కాదు టీటీడీ చైర్మన్, ఇతర సభ్యులు, ఈవో. అయినా కూడా సరిగ్గా ప్రతిపక్షం అవకాశం కోసం ఎదురు చూస్తున్నప్పుడు మహాసంప్రోక్షణ వివాదం కోరి తల మీద తెచ్చి పెట్టారు. అసలు వెయ్యి సంవత్సరాలుగా రామానుజచార్యుల కాలం నుండీ ఈ క్రతువు జరుగుతూనే వుంది. ప్రతీ పన్నెండు సంవత్సరాలకి ఒకసారి స్వామి వారికి విశేష పూజలు, ఆగమ శాస్త్ర యుక్తంగా సేవలు జరుగుతాయి. మరి గతంలో చేసిన విధంగానే ఇప్పుడూ చేస్తే పోయేదానికి కొత్తగా భక్తుల్ని నిషేధించటం ఎందుకు? దీనికి టీటీడీ దగ్గర సరైన సమాధానం వుందని అనుకోలేం.

 

 

ఎందుకంటే, వారు చెబుతున్నట్టు గతంలో వచ్చిన దాని కంటే ఇప్పుడు చాలా ఎక్కువ మంది వస్తున్నారన్నది నిజం. కానీ, అందుకు తగ్గట్టే సాంకేతిక సౌకర్యాలు కూడా పెరిగాయి. మనసుంటే మార్గమూ వుంటుంది. రోజుకు ఇరవై వేల మందికి ఏ విధంగా చూసినా దర్శనం కల్పించే అవకాశం వుంటుందని బోర్డు వారే ఒప్పుకున్నప్పుడు ఆ పని చేయకుండా మొత్తంగా దర్శనాలు రద్దు చేయటం, అవసరం వున్నా లేకున్నా కొండపైకి దార్లు మూయటం, సీసీ కెమెరాలు పని చేయవని చెప్పటం… ఇదంతా ఎందుకు? రమణ దీక్షితులు కేంద్రంగా సాగుతోన్న వివాదానికి మరింత ఆజ్యం పోసింది మహా సంప్రోక్షణ!

చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా నిర్ధిష్టమైన ఆదేశాలు ఇవ్వటంతో పెద్ద దుమారం తప్పిందనాలి. ప్రతిపక్ష నేత జగన్ దీనిపై నోరు విప్పకున్నా ఆయన పార్టీ ప్రతినిధి రోజా కొండపైనే కామెంట్స్ చేశారు. సామాన్య భక్తులు కూడా కొంత వరకూ ఆగ్రహం చెందారనే చెప్పాలి. ఒకవేళ ఈ లోపే ఎవరైనా కోర్టుకి వెళ్లి పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ లాంటిది వేసి వుంటే? అది మీడియాలో మరింత రచ్చకి దారి తీసేది! ప్రత్యేక హోదా విషయంలో తమని టార్గెట్ చేస్తున్న చంద్రబాబుని బీజేపీ ఈ విషయంలో కార్నర్ చేసి వుండేది. హిందూ మతపరమైన విషయాలు, అదీ తిరుమల వెంకన్నకు సంబంధించిన వివాదం అయితే… కాషాయ పార్టీని నియంత్రించటం కష్టమే అయివుండేది.

 

 

వారికి ప్రత్యేక హోదా విషయంలో జరుగుతోన్న ప్రచారం నుంచీ ఏపీ ప్రజల దృష్టి మరల్చటానికి అచ్చంగా ఇలాంటి గొడవే కావాలి. దాన్ని టీటీడీ చక్కగా అందించింది. సమయానికి ఏపీ సీఎం తేరుకోవటంతో హిందువుల మనోభావాల చుట్టూ జరిగే రాజకీయం ఆదిలోనే ఆగిపోయింది! ఆ మధ్య దుర్గ గుడి వివాదం, ఇప్పుడు తిరుమల… ఇలాంటివి ఎన్నికల ఓటర్ల మీద తీవ్ర ప్రభావమే చూపే అవకాశం వుంది. కానీ, వీటిల్లో చాలా వరకూ ప్రభుత్వం, మంత్రులు, సీఎం పాత్ర చాలా తక్కువ. ఈవోలు, దేవాలయ బోర్డుల నిర్వాకాలే ఎక్కువ. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నడుస్తోన్న ఈ కీలక సంవత్సరంలో ఇలాంటి సున్నితమైన అంశాలపై ఇక ముందు మరింత జాగ్రత్తగా వుంటే మంచిది! గొడవ జరిగాక సద్దుమణిగించటం… ఎంతో కొంత డ్యామేజ్ చేసే తీరుతుంది. వివాదం చెలరేగకుండా వుండేలా చర్యలు వుండాలి.