అడ్డంగా బుక్కైన వైసీపీ.. బీజేపీతో సీక్రెట్ దోస్తీ

 

వైసీపీ, బీజేపీ మధ్య సీక్రెట్ దోస్తీ నడుస్తుందని టీడీపీ తరచూ ఆరోపిస్తూ ఉంటుంది. అయితే ‘ఇది నిజమే’ అని విజయవాడ నగర వైసీపీ అధికార ప్రతినిధి మనోజ్‌ కొఠారీ అంగీకరించి పెద్ద బాంబు పేల్చారు. వైసీపీని ఇరుకున పెట్టారు. ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ‘టైమ్స్‌ నౌ’ జరిపిన స్టింగ్‌ ఆపరేషన్‌లో మనోజ్‌ కొఠారీ వైసీపీ, బీజేపీ మధ్య బంధం ఉందని స్పష్టంగా చెప్పారు. దానితో పాటు మరెన్నో విషయాలు బయటపెట్టారు. ఇరు పార్టీల మధ్య అధికారిక పొత్తు లేనప్పటికీ.. పోటీ విషయంలో రహస్య అవగాహన ఉందని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలాంటి వారు పోటీచేసే చోట బలహీనమైన అభ్యర్థులను బరిలో నిలపాలన్నది తమ పార్టీ విధానమని మనోజ్‌ వెల్లడించారు.

స్టింగ్‌ ఆపరేషన్‌లో ‘టైమ్స్‌ నౌ’ ప్రతినిధి.. బీజేపీతో మీకు పొత్తు లేదు కదా? అని ప్రశ్నించగా.. 'పొత్తులేనంత మాత్రాన అవగాహన లేదని కాదు! మేం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికాం కదా! బీజేపీ నిర్ణయాలకు మద్దతు పలుకుతాం. మా మధ్య అవగాహన ఉంది. మావైపు నుంచి విజయసాయి రెడ్డి తన పని పర్‌ఫెక్ట్‌గా చేస్తున్నారు.' అని మనోజ్‌ బదులిచ్చారు. బుగ్గన కూడా ఢిల్లీలో రామ్‌మాధవ్‌ను కలిశారు కదా? అని ప్రశ్నించగా.. 'బుగ్గన మంచి విద్యావంతుడు. ఆయన నాన్సెన్స్‌ మాట్లాడరు. బుగ్గన కంటే విజయసాయి రెడ్డి చాలా పర్‌ఫెక్ట్‌గా పని చేస్తున్నారు.' అని సమాధానమిచ్చారు. అదేవిధంగా.. 'జగన్‌కు ఏమేమి, ఎలా జరగాలో అవన్నీ జరిగేలా విజయ సాయిరెడ్డి చూస్తున్నారు. చంద్రబాబు చాలా తెలివైన నాయకుడు. జగన్‌ మరో 50 ఏళ్లు ముఖ్యమంత్రి కాకుండా చేస్తారు. దానికోసం ఏమైనా చేస్తారు. కేంద్రానికీ, జగన్‌కూ మధ్య మంచి సంబంధాలు ఉండేలా విజయసాయి రెడ్డి చూస్తున్నారు.' అని చెప్పుకొచ్చారు. నిజం చెప్పాలంటే.. బీజేపీకి ఇక్కడ అభ్యర్థులే లేరు. బీజేపీ కొన్ని సీట్లు గెలవాలనుకుంటోంది. అక్కడ మా పార్టీ బలహీన అభ్యర్థులను నిలబెడుతుంది. ఉదాహరణకు కన్నా లక్ష్మీనారాయణపై మా అభ్యర్థి బలహీనంగా ఉంటారు. ఐదేళ్లలో జగన్‌ చాలా మారారు. రాజకీయాలను బాగా అర్థం చేసుకోవడం జగన్‌కు విజయసాయి నేర్పారు. ఒక్కసారి జగన్‌ సీఎం అయితే... చంద్రబాబు ఇక మళ్లీ జన్మలో ముఖ్యమంత్రి కాలేరు. ఇది తథ్యం! అని స్టింగ్‌ ఆపరేషన్‌లో సంచలన వ్యాఖ్యలు చేసి అటు వైసీపీని, బీజేపీని ఇరుకున పెట్టారు. ఈ స్ట్రింగ్ ఆపరేషన్ పుణ్యమా అని ఇన్నిరోజులు వైసీపీ, బీజేపీ మధ్య సీక్రెట్ దోస్తీ అని ఆరోపిస్తున్న టీడీపీకి ఎన్నికల ముందు మంచి ఆయుధం దొరికినట్లు అయింది.