అప్పుడు ప్రత్యేక హోదా.. ఇప్పుడు అమరావతి

ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్ర విభజనతో ఏర్పడిన గాయానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా అనే మందు వేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ నిర్ణయాన్ని అప్పటి విపక్షాలు స్వాగతించాయి. బీజేపీ అయితే ఐదు కాదు పది సంవత్సరాలు ప్రత్యేకహోదా ఇవ్వాలని చెప్పింది. తీరా ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ప్రత్యేకహోదాపై మాట మార్చింది. ప్రత్యేకహోదా కంటే విలువైన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పింది. అప్పుడు బీజేపీతో దోస్తీ చేస్తోన్న అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్యాకేజీకి సరే అన్నారు. ప్యాకేజీతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. కానీ కొంతకాలానికి బీజేపీ ప్రభుత్వం ప్యాకేజీ విషయంలో మోసం చేసిందని ఆరోపిస్తూ.. హోదానే కావాలని పట్టుబట్టారు. బీజేపీతో దోస్తీ కూడా కట్ చేసుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

 

ఇక ప్రస్తుత ఏపీ అధికార పార్టీ వైసీపీ అయితే.. ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేకహోదా తీసుకొస్తామని హామీ ఇచ్చింది. టీడీపీ కారణంగానే ఏపీకి హోదా రాలేదని, మెజారిటీ ఎంపీ స్థానాల్లో తమ పార్టీని గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచైనా హోదా సాధిస్తామని చెప్పింది. 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లతో ఘన విజయం సాధించింది. కానీ ఎన్నికలకు ముందు కేంద్రం మెడలు వంచైనా హోదా సాధిస్తామని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసింది. హోదా ఇచ్చేవరకు కేంద్రాన్ని అడగటం తప్ప ఏం చేయలేమని, కేంద్రంలో బీజేపీకి పూర్తీ మెజారిటీ ఉంది కాబట్టి హోదాపై ఒత్తిడి తీసుకురాలేమని చెప్పుకొచ్చింది. ఇక జనసేన సంగతి సరేసరి. పాచిపోయిన లడ్డులు ఇచ్చారని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు అదే బీజేపీతో దోస్తీ చేస్తూ హోదా సంగతే మరిచారు. మొత్తానికి ఇలా అన్ని పార్టీలు కలిసి ప్రత్యేకహోదాని అటక ఎక్కించాయి. ఇప్పుడు అమరావతికి కూడా అదే పరిస్థితి తీసుకొస్తున్నాయి.

 

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే అప్పటి ప్రతిపక్ష వైసీపీ స్వాగతించింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అయితే అసెంబ్లీ సాక్షిగా రాజధాని నిర్ణయాన్ని స్వాగతించి, రాజధాని కోసం కనీసం 30 వేల ఎకరాలైనా కావాలన్నారు. ఎన్నికల సమయంలో కూడా రాజధానిని అమరావతి నుంచి తరలించే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి.. మూడు రాజధానులను తెరదీశారు. అమరావతి రైతులు ఉద్యమిస్తున్నా లెక్క చేయకుండా మూడు రాజధానులకు శ్రీకారం చుట్టారు. దీంతో టీడీపీ అమరావతి రైతుల తరఫున గళం వినిపిస్తోంది. కానీ రాజధాని తరలింపుని అడ్డుకుంటామన్న భరోసాని మాత్రం కలిగించలేకపోతోంది. టీడీపీ బలంగా నిలబడి దీనినొక రాష్ట్ర స్థాయి ఉద్యమంలా చేస్తే తప్ప.. టీడీపీపై నమ్మకం కలిగే పరిస్థితి లేదు. ఇక బీజేపీ ని ప్రజలు నమ్మేపరిస్థితి లేదు. కేంద్రం కలగచేసుకోదు, కానీ రాష్ట్ర బీజేపీ మాత్రం అమరావతినే రాజధానిగా కోరుకుంటోందని చెప్పడం, గవర్నర్ మూడు రాజధానుల బిల్లు ఆమోదించడం.. ఇవన్నీ చూసి ప్రజలకు బీజేపీపై నమ్మకం పోతోంది. ఇక బీజేపీతో దోస్తీ చేస్తోన్న జనసేన పరిస్థితి కూడా అలాగే ఉంది. అమరావతి కోసం ఉద్యమిస్తామని చెప్తున్నా నమ్మకం కలగట్లేదు. చేతల్లో చూపిస్తేనే నమ్మే పరిస్థితి ఉంది. మరి అన్ని పార్టీలు కలిసి అమరావతిని కూడా ప్రత్యేకహోదా లాగా అటక ఎక్కిస్తాయో? లేక కనీసం ఒక్క పార్టీ అయినా బలంగా నిలబడి అమరావతి కోసం ఉద్యమిస్తాయో చూడాలి.