రాజీనామా బాటలో ముగ్గురు ఏపీ ఇంటెలిజెన్స్ డీఎస్పీలు!!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో... ఏ.బీ. వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ అదనపు డి.జి.పి. గా ఉన్న సమయంలో విశేషంగా సేవలందించిన ముగ్గురు డి.ఎస్.పి. లకు వై ఎస్ ఆర్ సి పీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంటెలిజెన్స్ కే సేవలందించే భాగ్యాన్ని పోలీసు బాస్ లు కల్పించారు. ఇంతకీ, ఆ ముగ్గురూ కూడా ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు గానే నిజాయితీ తో కూడిన నివేదికలను ఏ.బి. కి ఇస్తూ వచ్చే వారు. నాయుడు పార్టీ గల్లంతవుతుందని, 50 కి మించి సీట్లు రావని మరీ ఢంకా బజాయించి సమగ్ర నివేదికలు, నియోజకవర్గాల వారీగా ఇచ్చారు. మిగిలిన డి.ఎస్.పి ల మాదిరి, ఏ.బి. అడుగులకు మడుగులు కొట్టకుండా...ఉన్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు గా వివరించిన ఆ ముగ్గురు డి ఎస్ పి లకు ఆశ్చర్యకరంగా ఇప్పుడు లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బీ లో కానీ, విజిలెన్స్ ఎండ్ ఎంఫోర్సుమెంట్ లో కానీ అవకాశం ఇవ్వటానికి పోలీసు బాస్ లు ససేమిరా అంటున్నారు.

ఆ ముగ్గురూ కూడా తెలుగు దేశం హయాం లో నిక్కచ్చిగా పనిచేశారు కాబట్టి, ఎలాంటి రాగ ద్వేషాలకు లొంగకుండా పని తీరు ప్రదర్శించారు కాబట్టి వారి సేవలు ఇంటెలిజెన్స్ కె అవసరం పడతాయని పోలీసు బాస్ లు సూత్రీకరించారు. దరిమిలా...వారి ముగ్గురికీ ఇంటెలిజెన్స్ లోనే కొనసాగాల్సిన గతి ఏర్పడింది. వాస్తవానికి లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బి లో కానీ వారికి అవకాశం కల్పించటానికి దారులు ఉన్నప్పటికీ, వారిని మినహాయించి వేకెన్సీ రిజర్వ్ (వీ.ఆర్.) లో ఉన్న చాలా మందికి పోస్టింగులు ఇవ్వటానికి కూడా పోలీసు బాస్ లు ప్రయత్నిస్తున్నారు.

విషయం తెలిసిన ఆ ముగ్గురు ఇంటెలిజెన్స్ డి ఎస్ పి లు ఇక తమకు కీలకమైన విభాగాల్లో అవకాశం రాదనీ నిర్ధారించుకుని, రాజీనామా ఇవ్వటానికి సింథ్పడినట్టు పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ భోగట్టా. ఈ విషయమై వారు ఇప్పటికే, పలువురు సీనియర్ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎలాంటి ఫలితమూ కనపడక పోవటం తో , గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ముగ్గురూ కూడా తమ పోస్టులకు రాజీనామా చేసేద్దామని నిర్ణయానికి వచ్చినట్టు ఒక సీనియర్ మోస్ట్ పోలీస్ బాస్ తన ఆంతరంగికుల దగ్గర సమాచారాన్ని షేర్ చేసుకున్నట్టు వెలగపూడి సెక్రెటేరియట్ లో చెప్పుకుంటున్నారు. ఇదే గనుక జరిగితే, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర మైన పరిస్థితి ఏర్పడుతుందని, హోమ్ మంత్రి నేరుగాఈ వ్యవహారం పై దృష్టిపెట్టి , ముఖ్యమంత్రి దృష్టి లో సమస్యను ఉంచాలని సీనియర్ పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. డి ఎస్ పీ స్థాయి అధికారులు కూడా నైరాశ్యానికి లోనై, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే, పోలీస్ శాఖపై ప్రజలకు తప్పు సంకేతాలు వెళతాయని ఆందోళనను పోలీసు అధికారులే వ్యక్తం చేస్తున్నారు. అసలు పోలీస్ శాఖపై హోమ్ మంత్రికి సమగ్ర అవగాహనా ఉండేలా ఇంతవరకూ ఒక కార్యాచరణ తో కూడిన ప్లాన్ ను ఏదైనా సీనియర్ అధికారులతో డిస్కస్ చేశారా, లేదా అనేది కూడా తెలియని ఒక అయోమయ స్థితి నెలకొంది. 

వాస్తవానికి ఆ ముగ్గురు డి ఎస్ పి లు కూడా వాస్తవాలతో కూడిన నివేదికలు ఇవ్వటం అనేది, ఎన్నికల ముందు వై ఎస్ ఆర్ సి పీ కి కూడా కొంత నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు పాలక పక్షం లో ఉన్న వై ఎస్ ఆర్ సి పీ ప్రస్తుతమ్ ఈ తరహా అన్యాయం పై నోరు మెదపకపోవటం తో ఆ ముగ్గురు డి ఎస్ పి లు అనివార్యంగా తమ రాజీనామా నిర్ణయాన్ని నేరుగా హోమ్ మంత్రి దృష్టి కె తీసుకెళ్లాలని  భావిస్తున్నారు. చిత్రం కాకపొతే, వారి నిక్కచ్చి తనమే ...వారికి ఇపుడు కీలక విభాగాల్లో పోస్టింగులు రాకుండా అడ్డు పడటమేమిటని సెక్రెటేరియేట్ సీనియర్లు ఆశ్చర్య పోతున్నారు. వాస్తవానికి అవినీతీ నిరోధక శాఖ (ఏ సి బీ) కి ఇప్పుడు 14 మంది డి ఎస్ పి ల అవసరం ఉన్నప్పటికీ, ఇటువంటి నిజాయితీ పరులైన అధికారులని ఏ సి బీ కోసం వదులుకోవటానికి ఇంటెలిజెన్స్ శాఖ సిద్ధంగా లేదని ఆ శాఖ లో ఒక పెద్ద ఆఫీసర్ వాక్రుచ్చారు. మరి ఎల్లా కాలమూ, వారు అక్కడే సేవలందించాలా అనే ప్రశ్నకు మాత్రం ఆ పెద్దాయన దగ్గర సమాధానం లేదు. మొత్తానికి, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమిటంటే--మరీ ముక్కు సూటిగా పొతే, ఒకో సారి అవసరాలకు కూడా వెతుక్కునే పరిస్థితి ఎదురవ్వచ్చు అని...