18న వైసీపీలోకి తోట త్రిమూర్తులు.. మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా!!

 

తూర్పు గోదావరి జిల్లా సీనియర్ నేత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన అధికార పార్టీ వైసీపీలో చేరటానికి ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన ఈ నెల 18న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు సమాచారం. త్రిమూర్తులతో పాటుగా టీడీపీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సైతం వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీరి చేరికకు సీఎం జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. 

ఎన్నికల ముందు నుండే తోట త్రిమూర్తులు టీడీపీ అధినాయకత్వం మీద అసహనంతో ఉన్నారు. ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం తరువాత త్రిమూర్తులు సారధ్యంలో కాకినాడలో టీడీపీ కాపు నేతల సమావేశం జరిగింది. ఆ సమయంలోనే త్రిమూర్తులు పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు తూర్పు గోదావరి పర్యటనకు వెళ్లిన సమయంలోనూ త్రిమూర్తులు దూరంగానే ఉన్నారు. దీంతో త్రిమూర్తులు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం మరింత ఊపందుకుంది. శుక్రవారం త్రిమూర్తులు తన అనుచరులతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలో తాను టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లనున్న విషయాన్ని ప్రకటించినట్లు సమాచారం.

అనేక తర్జన భర్జనల తరువాత తోట త్రిమూర్తులు టీడీపీ వీడాలని నిర్ణయించారు. బీజేపీ, వైసీపీ నుండి ఆహ్వానం ఉండటంతో కొద్ది కాలంగా ఆ రెండు పార్టీల్లో ఎందులో చేరాలా అనే దాని పైన అనేక చర్చలు చేసారు. బీజేపీ నుండి జాతీయ నేత రాం మాధవ్ తో పాటుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సైతం త్రిమూర్తులను పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, జిల్లా సమీకరణాలు చూసిన తరువాత ఆయన వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తోట త్రిమూర్తులు ఈ నెల18న వైసీపీలో చేరటానికి ముమూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం. త్రిమూర్తులతో పాటుగా మరో ఇద్దరు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు సైతం వైసీపీలో చేరటానికి రంగం సిద్దమైంది. మరి కొంత మంది కాపు నేతలు సైతం టీడీపీ నుండి బయటకు వస్తారనే ప్రచారం గోదావరి జిల్లాల్లో సాగుతోంది.