సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ ఇచ్చే సీజనల్ ఆహారం


గుమ్మడి, బొప్పాయ రోగనిరోధకశక్తి పెంచుతాయి
ఎనర్జీ బూస్టర్ గా పనిచేసే సిట్రస్ జాతి పండ్లు


కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే ఈ సమస్యను నివారించే ఉత్తమ మార్గం. మరి మనలో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్న విషయంపై అవగాహన పెంచుకోవాలి.  ప్రతిరోజూ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఎన్నో పోషక విలువలతో పాటు అనారోగ్య సమస్యలను నివారించే గుణాలు కూడా ఉన్నాయి. కొన్ని రకాల పండ్లను మనం ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతేకాదు శరీర భాగాల పని తీరు సక్రమంగా సాగుతుంది. సీజనల్ వచ్చే అనేక వ్యాధుల నుంచి,  కరోనా లాంటి భయంకర రోగాల నుంచి మనకు రక్షణ లభిస్తుంది. నిత్యం మార్కెట్లో లభించే రకరకాల ఆహార పదార్ధాలు మనలో రోగనిరోధకశక్తిని పెంచేందుకు దోహదపడతాయి వాటిలో కొన్ని మనం ఇప్పుడు చూద్దాం...

 గుమ్మడి కాయ
గుమ్మడి కాయలో రెండు రకాలు బూడిద గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ. తీపి గుమ్మడి కాయలో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇందులో రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరిచే అనేక సూక్ష్మ పోషకాలు లభిస్తాయి. గుమ్మడికాయ ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరంలోని వివిధ భాగాలు సక్రమంగా పనిచేస్తాయి.

బొప్పాయి
బొప్పాయి గురించి మనందరికీ తెలుసు. ఇందులో ఉండే పాపినేని ఎంజాయ్ రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. బొప్పాయి రోజూ తినేవారిలో  విటమిన్ లోపాలు ఉండవు . అంతేకాదు డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి పండు ఇస్తాయి. వీటితో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో తెల్లరక్తకణాల సంఖ్యను పెంచుతాయి.

- కివి
ఇటీవల మనకు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. వీటిలో పొటాషియం, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. శరీరంలోని రోగ నిరోధక శక్తి పెంచడానికి దోహదం చేస్తాయి.

- నిమ్మకాయ
సహజంగానే సిట్రస్ జాతి పండ్లను బూస్టింగ్ ఫుడ్స్ అని అనొచ్చు. ఇక నిమ్మకాయ గురించి మనందరికీ తెలుసు. వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బుల నుంచి కాపాడటానికి అవసరమైన విటమిన్ సి ఇందులో పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. రోజూ ఒక గ్లాసు నిమ్మరసం తాగితే వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు వలన వచ్చే ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

- నారింజ
జ్వరం వచ్చిన వాళ్ళు, నీరసంగా ఉన్న వాళ్ళు  ఆరెంజ్ రసం తాగితే  తక్షణం శక్తి వస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఈ పండు తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. 

- ఉసిరి
ఔషధాల సిరి గా ఉసిరిని చెప్పవచ్చు. ఇందులో రెండు రకాలు పెద్ద ఉసిరి, చిన్న ఉసిరి. ఈ రెండు రకాల ఉసిరి లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా విటమిన్ సి తో పాటు ఇతర పోషకాలు శరీరానికి అందుతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేసే ఉసిరిలో అధిక రక్తస్రావాన్ని నివారించేలో లక్షణాలు ఉన్నాయి. దీన్ని కూరగాయలు లోనే కాకుండా ఔషధాలలో ఎక్కువగా వాడతారు.

- అరటిపండు
అరటిపండు, అప్రికాట్ వంటి పండ్లలో ఎక్కువ మోతాదులో పొటాషియం ఉంటుంది. మన శరీరానికి కావలసిన పొటాషియం లభిస్తుంది. వీటిని రోజూ తీసుకోవడం వలన బి.పి తగ్గుతుంది. అంతేకాదు అధిక రక్తపోటుతో ఇబ్బంది పడే వాళ్లకి పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండు మంచి ఔషధంగా పనిచేస్తాయి. వీటిలో రోగనిరోధకశక్తిని పెంచే గుణాలు మెండుగా ఉన్నాయి.

- పుచ్చకాయ
ఆకుపచ్చ ఎరుపు రంగులతో ఆకట్టుకునే పుచ్చకాయ సీజనల్ లోనే లభించేది. కానీ ఇప్పుడు ఏ సీజన్లోనైనా మనకు మార్కెట్లో కనిపిస్తుంది. పుచ్చకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.  నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలు రోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

- అల్ల నేరేడు
సీజనల్ గా  వచ్చే ఈ పళ్ళు యాంటీఆక్సిడెంట్లు కు కేరాఫ్ అని చెప్పవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగవడానికి ఈ పండ్లు ఎంతో దోహదం చేస్తాయి.  చక్కెర వ్యాధితో బాధపడే వాళ్ళు నేరేడు పళ్ళ గింజలను ఎండబెట్టి పొడి చేసి ఒక చెంచా పొడిని నీటిలో వేసుకుని తాగితే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.