పేపర్లో చుట్టిన ఆహారం తింటే కేన్సర్‌


కాలం మారిపోయి ఉండవచ్చు. మనం తినే ఆహారంలో చిన్నా చితకా మార్పులు వచ్చి ఉండవచ్చు. కానీ  మనదేశంలో ఇప్పటికీ ఆహారాన్ని అమ్మే తీరులో పెద్దగా మార్పు రాలేదు. రోడ్డు పక్కన దొరికే సమోసాల దగ్గర్నుంచీ, బండి మీద అమ్మే బజ్జీల వరకూ సాధారణంగా న్యూస్‌పేపర్లోనే చుట్టి ఇస్తారు. న్యూస్‌పేపర్ చవకగా దొరుకుతుంది కదా, దాంతో పొట్లం తేలికగా కదా అని అమ్మేవాడు అనుకోవచ్చు... కానీ ఆ అలవాటుతో కేన్సర్ సైతం దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

 

అసలు న్యూస్‌పేపర్లలో చుట్టిన పదార్థాలు ఎంతవరకు క్షేమం అన్న అనుమానం వచ్చింది మన దేశ ఆరోగ్యశాఖ మంత్రి జే.పి.నడ్డాకి. దాంతో ఈ అలవాటు మీద తగిన మార్గదర్శకాలను జారీచేయవలసిందిగా The Food Safety and Standards Authority of India (FSSAI) కి సూచించారు. దాంతో FSSAI వెలువరించిన ఓ ప్రకటన ఇప్పుడు దుమారాన్ని రేపుతోంది.

 

FSSAI ప్రకారం న్యూస్‌పేపర్‌ ముద్రణలో వాడే నానారకాల రంగులు, రసాయనాల వల్ల ఆరోగ్యానికి తీవ్రహాని జరగవచ్చు. పైగా వీటిలో ఉండే Bioactive materials వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు, పాత న్యూస్‌పేపర్ల మీద రకరకాల సూక్ష్మక్రిములు వృద్ధి చెందే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది FSSAI.

 

రీసైక్లింగ్ చేసిన కాగితాలతో రూపొందిన అట్టపెట్టెల వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తప్పంటున్నారు. వీటిలో లోహ అవశేషాలు, phthalates వంటి హానికారక రసాయనాలు ఉంటాయట. అవి జీర్ణసంబంధ వ్యాధులకి దారితీస్తాయనీ, శరీరాన్ని విషమయం చేసేస్తాయనీ హెచ్చరిస్తున్నారు.

 

అదీ విషయం! కాబట్టి న్యూస్‌పేపర్లలో కానీ, రీసైక్లింగ్ చేసిన వస్తువులలో కానీ ఆహారపదార్థాలను చుట్టవద్దన్నది FSSAI సూచన. కనీసం ఆహార పదార్థాలలో ఉండే నూనెను పీల్చేసేందుకు కూడా వీటిని వాడవద్దంటున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, రోగులు ఇలాంటి అలవాటుకి దూరంగా ఉండాలని కోరుతున్నారు. వీరిలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, కేన్సర్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు.

 

న్యూస్‌పేపర్లో ఆహారాన్ని అందించడాన్ని నివారించేందుకు చట్టబద్ధమైన చర్యలు తీసుకునే అవకాశం ఏదీ లేదు. కాకపోతే ప్రజల్లోనూ, అమ్మకందారుల్లోనూ తగిన అవగాహన కల్పించేందుకు దేశమంతటా ప్రచారం చేసే దిశగా FSSAI చర్యలు తీసుకుంటోంది. అది ఎంతవరకు ఫలితాలనిస్తుందో వేచిచూడాల్సిందే! ఈలోగా మనవరకు మనం అలాంటి ఆహారానికి కాస్త దూరంగా ఉంటే మంచిది.

 

- నిర్జర.