ఇదీ ఎర్త్‌ డే కథ

 

 

1969 జనవరి 28: అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో ఒక చమురుబావి నుంచి ముడిచమురు పొంగి పొర్లడం మొదలైంది. పదిరోజుల పాటు జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు లక్ష బ్యారెల్స్ చమురు నీటిపాలైంది. నీటిలో చమురు కలవడం వల్ల వేలాది సముద్ర పక్షులు చనిపోయాయి. ఇక నీటిలో ఉన్న ప్రాణులకి జరిగిన నష్టానికైతే లెక్కే లేదు. సహజంగానే ఈ వార్త సంచలనం సృష్టించింది. ‘ఇంధనం కోసం చేసే ప్రయత్నాలలో ఇవన్నీ మామూలే!’ అంటూ జనం ఎవరి పని వాళ్లు చూసుకున్నారు. కానీ కొంతమందిలో మాత్రం ఈ ఘటన భయం కలిగించింది. పర్యావరణం పట్ల మనం ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నమా! అన్న ఆలోచన రేకెత్తించింది. ఆ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ ఓ ఉద్యమం నిర్మించే ప్రయత్నం జరిగింది. అదే ‘ఎర్త్‌ డే’.

 

1970లో అప్పటి అమెరికన్‌ సెనెటర్‌ Gaylord Nelson నేతృత్వంలో ఈ ఎర్త్‌ డే అనే ఉద్యమం మొదలైంది. ఆ ఏడాది ఏప్రిల్‌ 22న దాదాపు రెండుకోట్ల మంది ఊరేగింపులలోపాల్గొని పర్యావరణం పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు. అప్పటి నుంచి ఏటా ఎర్త్‌ డేను నిర్వహిస్తూనే ఉన్నారు.

 

అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశంలో పర్యావరణం గురించి పోరాడటం ఏమంత తేలిక కాదు. ఎందుకంటే పర్యావరణానికి హాని కలగకుండా భౌతికమైన అభివృద్ధి సాధ్యంకాదు. అందుకే అక్కడి ప్రభుత్వాలు కూడా గ్లోబల్‌ వార్మింగ్‌ వంటి సమస్యలకి, పారిశ్రామిక అభివృద్ధి కారణం కాదంటూ వాదించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. పర్యావరణం గురించి చిన్నాచితకా ఉద్యమాలు మొదలైనా... వాటి మాట ప్రభుత్వం ముందు నిలబడదు. కానీ అలాంటి చిన్నా చితకా ఉద్యమాలన్నీ ఏకమయ్యే అవకాశం కల్పించింది ‘ఎర్త్‌ డే’. ఫలితంగా ప్రభుత్వం సైతం తల వంచి పర్యావరణాన్నీ, వన్య ప్రాణులనీ కాపాడేందుకు చట్టాలు చేయక తప్పలేదు.

 

ఒక చిన్న ఆందోళనగా మొదలైన ‘ఎర్త్‌ డే’ ఉద్యమం ఇప్పుడు వందకు పైగా దేశాల్లో ప్రభావం చూపుతోంది. క్రితం ఏడాది ఎర్త్‌ డే రోజున ఇండియా సహా 120 దేశాలు Paris Climate Agreement మీద సంతకం చేశాయంటే... ఉద్యమం ఫలిస్తున్నట్లేగా! గ్లోబల్‌ వార్మింగ్‌ను అదుపు చేస్తూ కనీసం రెండు డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించడమే ఈ Paris Climate Agreement ఉద్దేశం.

 

ఎర్త్‌ డే రోజున ఉద్యమకారులు ఎలాగూ ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడతారు. కోట్ల కొద్దీ చెట్లని నాటుతూ ఉంటారు. కానీ ఈ ఉద్యమంతో సంబంధం లేనివారు కూడా ఎంతోకొంత పర్యావరణం మీద శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు. ‘ఒక్కడినే ఏం చేయగలను?’ అనుకోవడానికి లేదనీ... పర్యావరణం మీద ప్రతి ఒక్కరి చర్యా ఎంతోకొంత ప్రభావం చూపుతుందని అంటున్నారు. చిన్నచిన్న దూరాలకి సైకిల్‌ లేదా నడక మీద ఆధారపడటం, చెట్లు నాటడం, రీసైకిల్డ్‌ వస్తువులని ప్రోత్సహించడం, విద్యుత్తుని వృధా చేయకపోవడం, అనవసరమైన ప్రింట్‌ఔట్స్‌ తీసుకోకపోవడం, శాకాహారం వైపు మొగ్గు చూపడం... లాంటి సవాలక్ష ఉపాయాలన్నీ పర్యావరణాన్ని ఎంతోకొంత కాపాడేవే! ఇవే కనుక పాటిస్తే ప్రతిరోజూ ఎర్త్‌ డేనే!

 

- నిర్జర.