సలహా ఇవ్వడం కూడా ఒక కళే!

ప్రపంచంలో అతి సులువుగా లభించేది ఏమన్నా ఉంటే సలహానే! అందుకనే ఎవరికి వారు అవసరం ఉన్నా లేకున్నా ఉచిత సలహాలు పడేస్తూ ఉంటారు. కానీ ఒకోసారి మనం ఆచితూచి ఇచ్చే సలహానే మరొకరి జీవితంలో వెలుగులు నింపుతుంది. వారి సమస్యను ధైర్యంగా ఎదుర్కొనేందుకు అండగా నిలుస్తుంది. అందుకనే అనువైన సలహాని ఇవ్వడం కూడా ఒక కళగా భావించవచ్చు. ఇందుకోసం కొన్ని మెలకువలు పాటిస్తే సరి...

 

అడగనిదే! అవతలివారి సమస్య మీకెంత సామాన్యంగా తోచినా, దానికి ఖచ్చితమైన సలహా మీ దగ్గర ఉందని అనిపించినా... అడగకుండా ఇచ్చే సలహాకి అంత ఉపయోగం ఉండదు. సరికదా! వారు నొచ్చుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. ముఖ్యంగా అవతలి వ్యక్తితో అంత చనువు లేనప్పుడూ, నలుగురిలో ఉన్నప్పుడు... తొందరపడి ఇచ్చే సలహా వాళ్లని ఇబ్బంది పెట్టడానికే అవకాశం ఉంది. అందుకే అడగకుండా సలహా ఇవ్వకూడదంటారు పెద్దలు. ఒకవేళ అతని సమస్యకు మీ దగ్గరే పరిష్కారం ఉందని తోస్తే అతని అనుమతి తీసుకునో, ఒంటరిగా ఉన్నప్పుడో, మధ్యవర్తుల ద్వారాలో మీ సలహాను అందిస్తే సరి.

 

సావధానంగా విన్నాకే! సమస్య ఉన్నవారే సలహా కోసం అభ్యర్థిస్తారు. సమస్య ఉంది కాబట్టి దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడి కొంత ఉపశమనాన్ని పొందాలని అనుకుంటారు. కాబట్టి సలహా ఇవ్వాలనుకుంటూ వారి మాటలను సావకాశంగా వినితీరాలి. మనకి కాస్త విసుగు అనిపించినా, వారిని అడ్డుకోకుండా సంభాషణను సాగించాలి. వీలైతే మరిన్ని ప్రశ్నలు వేసి, సమస్యలోని భిన్న కోణాలను తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.

 

మనదిగా భావించి! సమస్య మనది కాకపోవచ్చు. కానీ మనం ఇచ్చే పరిష్కారంతో అది ముగిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి సమస్యని కాసేపు మనదిగా భావిస్తేనే, అందులోని లోతుపాతులు తెలుస్తాయి. అలా కాకుండా కేవలం ఒక మూడో వ్యక్తిగానే ఉంటే, సమస్య చాలా తేలికగా కనిపిస్తుంది. ‘ఇదే ఇబ్బంది నాకు తలెత్తితే, నేను ఏం చేయగలను? నేను తీసుకునే ప్రతి నిర్ణయానికీ ఎలాంటి సావకాశాలు ఉన్నాయి?’ అని ఆలోచిస్తేనే సమస్యకు హేతుబద్ధమైన పరిష్కారం లభిస్తుంది.

 

చర్చించండి! సలహా అడిగారు కదా అని అవతలివారిని ఊదరగొట్టేస్తే సరిపోదు. సలహాలదేముంది! సవాలక్ష చెప్పేయవచ్చు! అవతలివారు కూడా మొహమాటానికి పోయి ఊరకుండిపోవచ్చు. కానీ సమస్య గురించి మీకు తోచిన అభిప్రాయాలు, పరిష్కారాలు... అన్నీ కూడా అవతలివారితో చర్చించి నిర్మొహమాటంగా తేల్చేయాలి. అప్పుడే సలహా ఇవ్వడం అనేది ఒక కాలక్షేపంగా కాకుండా కార్యాచరణకు మార్గంగా నిలుస్తుంది.

 

నిజాయితీతో! సలహా కోసం వచ్చారు కదా అని చాలామంది అవతలివారిని చులకనగా చూస్తుంటారు. కానీ అవతలివారు తమమీద ఒక భరోసాతో వచ్చారన్న బాధ్యతని గుర్తుంచుకోరు. అలాంటి భేషజాలకు పోకుండా సమస్యను సానుకూలంగా విని, నిజాయితీగా తోచిన సలహాను ఇవ్వడం అవసరం. ఒకవేళ సమస్య పరిథి మనల్ని దాటిపోతోందని అనిపిస్తే... ఫలానా వ్యక్తినో, నిపుణుడినో కలిస్తే మంచిది అని చెప్పేయడం మంచిది.

 

- నిర్జర.