అలర్ట్ ఇండియా.. నార్త్, సౌత్‌లపై ఐఎస్ ఫోకస్

దారుణ మారణకాండతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఒక్కో దేశంపై దాడులు చేస్తూ.. తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోతోంది. విస్తరణలో భాగంగా ఎప్పటి నుంచో భారత్‌పై దాడులు చేయాలని ఎప్పటి నుంచో కుట్రలు పన్నుతోంది. అయితే మన నిఘా వర్గాలు, భద్రతా దళాలు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎన్నో ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాజాగా మరోసారి ఇండియాను టార్గెట్ చేసింది ఐఎస్.  త్వరలో గంగానది వద్ద జరిగే కుంభమేళా, కేరళలోని త్రిసూర్‌పురంలో జరిగే ఉత్సవాల్లో దాడులకు దిగుతామని హెచ్చరించింది. ఈ మేరకు మలయాళంలో పది నిమిషాల ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు.

 

ఆ ఆడియోలో దాడులు ఎలా జరపాలో తమ శ్రేణులకు సూచించారు.. విషం కలిపిన ఆహారాన్ని ప్రజలు తినేట్లు చూడాలని.. పెద్ద పెద్ద ట్రక్కులను ప్రజలపైకి నడిపించాలని.. రైళ్లు పట్టాలు తప్పేలా చేయాలని.. కత్తులతో స్వైర విహారం చేయాలని చెబుతూ ఆడియోను ముగించారు. కుంభమేళాతో పాటు త్రిసూర్‌లో జరిగే వేడుకలకు పెద్ద సంఖ్యలో జనం హాజరవుతూ ఉంటారు. అందువల్ల వీటిపై దాడి చేస్తే భారీ జననష్టం కలుగుతుందని ఉగ్రవాదుల అంచనా. రంగంలోకి దిగిన కేంద్ర నిఘా బృందాలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునే పనిలో పడ్డారు. వారి దర్యాప్తులో ఇది టెలిగ్రాం యాప్‌లో ఆప్గనిస్తాన్ నుంచి వచ్చినట్లుగా తేలింది. ఇందులోని గొంతు ఐఎస్ నేత రషీద్ అబ్దుల్లాగా తేలింది.

 

ఐఎస్ఐఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలోని పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాయి. తమ మనుగడ ప్రశ్నార్థకమవుతోందన్న భావనతో సురక్షిత ప్రాంతాలకు తమ సేనలను తరలించేందుకు ఐఎస్ అదినాయకత్వం కసరత్తులు ప్రారంభించింది. అలాగే తాము ఇంకా అంతం కాలేదనే భావనను ప్రపంచదేశాలకు తెలియజేసే ప్రణాళికలో భాగంగా అమెరికా సహా పలు యూరోపియన్ దేశాల్లో దాడులు చేస్తోంది. అలాంటి చర్యే కొద్ది రోజుల క్రితం జరిగిన లాస్‌వేగాస్ దాడి.

 

నెవెడా రాష్ట్రంలోని లాస్‌వేగాస్ సిటీని టార్గెట్ చేసిన దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 75 మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. తొలుత ఇది ఒక ఉన్మాది చర్యగా భావించినప్పటికీ దాడి చేసిన వ్యక్తి తమ వాడేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. ఇప్పుడు ఇండియాలో జరిపే దాడుల్లోనూ ఇదే తరహా ఫార్ములాను ఉపయోగిస్తామని ఉగ్రవాదులు పంపిన ఆడియో టేపులో స్పష్టంగా పేర్కొన్నారు. లక్షలాది మంది పాల్గొనే కుంభమేళా వంటి వేడుకల్లో ఇలాంటి దాడులు జరిగితే.. ప్రాణనష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహాకు కూడా అందదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి.