గులాబీకి గ్రేటర్ టెన్షన్! వరాలు పనిచేయవంటున్న విపక్షం

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందా? గులాబీ బాస్ ఎంట్రీకి అర్ధమేంటీ? కొత్త హామీలను జనాలు నమ్ముతారా?. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఐదు రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో పార్టీలన్ని స్పీడ్ పెంచాయి. బీజేపీ దూకుడుతో అధికార పార్టీలో ఓటమి భయం పట్టుకుందనే ప్రచారం జరుగుతోంది. దుబ్బాకలో టీఆర్ఎస్ పరాజయంతోనే తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోయాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కారుకు బ్రేకు పడితే.. ఆ పార్టీకి ముందు ముందు గండమేనన్న చర్చ జరుగుతోంది. దీంతో గ్రేటర్ ఎన్నికలపై స్వయంగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగారని చెబుతున్నారు. గతంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికలను కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. ప్రచారం కూడా చేయలేదు. అయితే గ్రేటర్ ఎన్నికలను మాత్రం ఆయన మినిట్ మినిట్ మానిటర్ చేస్తున్నారని తెలుస్తోంది. డివిజన్ల వారీగా పార్టీ పరిస్ఖితులను తెలుసుకుంటూ.. వివిధ సంస్థల ద్వారా సర్వే చేయిస్తూ.. వాటి వివరాల ఆధారంగా  పార్టీ  ఇంచార్జులకు కేసీఆర్ సలహాలు, సూచనలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 

 

తెలంగాణ భవన్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను కేసీఆరే రిలీజ్ చేశారు. గ్రేటర్ లో రోజుకు రోజుకు బీజేపీ గ్రాఫ్ పెరుగుతుండటంతో సీఎం స్వయంగా రంగంలోకి దిగారని చెబుతున్నారు. గ్రేటర్ జనాలకు ఆయన వరాలు కురిపించారు. అయితే కేసీఆర్ గ్రేటర్ హామీలపై గ్రేటర్ జనాల్లో చర్చ జరుగుతోంది. ఓటమి భయంతోనే కేసీఆర్ కొత్త హామీలు ఇచ్చారని అభిప్రాయపడుతున్నారు. వరద సాయం పేరుతో గులాబీ నేతలకు దోచి పెట్టి.. ఎన్నికలయ్యాకా అందరికి ఇస్తామని చెప్పడమేంటనీ ముఖ్యమంత్రిని విపక్షాలు నిలదీస్తున్నాయి. సర్కార్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే వరద బాధితులకే నేరుగా డబ్బులు ఇచ్చేవారని చెబుతున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందని సర్వేల్లో తేలడంతో కేసీఆర్ కొత్త ఎత్తులు వేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లోనూ జరుగుతోంది. లోకల్ బాడీస్ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ కేసీఆర్ ప్రచారం చేయలేదు. గత గ్రేటర్ ఎన్నికల్లోనూ అంతా కేటీఆరే చూసుకున్నారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక తమకు సవాల్ గా మారినా ప్రచారానికి వెళ్లలేదు కేసీఆర్. కాని గ్రేటర్ ఎన్నికలపై మాత్రం ఫోకస్ చేశారు. పార్టీ మేనిఫెస్టోను కూడా కేసీఆరే రిలీజ్ చేశారు. దీన్ని బట్టి గులాబీ నేతలకు ఓటమి భయం పట్టుకుందనే చర్చ జరుగుతోంది. అందుకే వరాలు ప్రకటించారని చెబుతున్నారు. 

 

కరోనా సమయంలో క్యాబ్, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లాక్ డౌన్ తో వాహనాలు రోడ్డు ఎక్కకపోవడంతో తినడానికి తిండలేక కొందరు డ్రైవర్లు అవస్థలు పడ్డారు. కరోనా సమయంలో వారిని అసలు పట్టించుకోలేదు కేసీఆర్ సర్కార్. పక్కన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆటో,  క్యాబ్ డ్రైవర్లకు 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఇక్కడ కూడా అలానే తమను ఆదుకోవాలని క్యాబ్, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు వేడుకున్నా టీఆర్ఎస్ సర్కార్ కనీసం స్పందించలేదు. లారీ డ్రైవర్లు కూడా ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నారు. లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో అంతా అప్పుల పాలయ్యారు. మూడు నెలల క్రితమే రోడ్డు ట్యాక్సీ రద్దు చేయాలని లారీ యజమానులు ప్రభుత్వానికి విన్నవించారు. అయితే అప్పుడు స్పందించని సర్కార్.. గ్రేటర్ ఎన్నికల వేళ వారికి ఊరటనిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ ఎన్నికల్లో  ఎలాగైనా గట్టెక్కేందుకే కేసీఆర్ సర్కార్ తాజా వరాలు ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ లో దాదాపు ఐదు లక్షల మంది ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారని అంచనా. వారంతా తమకు మద్దతిచ్చేలా రోడ్డు ట్యాక్స్ ను రద్దు చేశారని చెబుతున్నారు. 

 

కేసీఆర్ ఇప్పుడు ఎన్ని వరాలు ప్రకటించినా గ్రేటర్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని బీజేపీ, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలని ఎంత మెత్తుకున్నా పట్టించుకోకుండా.. ఎన్నికల వేళ చేయడాన్ని జనాలు కూడా అర్ధం చేసుకుంటారని చెబుతున్నారు. ఓట్ల కోసమే కేసీఆర్ కొత్త డ్రామాలు చేస్తున్నారని గ్రేటర్  ప్రజలు భావిస్తున్నారని, పోలింగ్ రోజున వారు తమ సత్తా చూపిస్తున్నారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.గులాబీ నేతలు మాత్రం తాము ఇచ్చిన హమీలపై ప్రజల్లో మంచి స్పందన వస్తుందని, గ్రేటర్ ఎన్నికల్లో తమకు ప్లస్ కాబోతున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరీ కేసీఆర్ హామీలు అధికార పార్టీని గట్టెక్కిస్తాయా లేక ప్రతిపక్షాలు చెబుతున్నట్లు ఓట్ల హామీగానే సిటీ జనాలు చూస్తారా చూడాలి మరీ..