అప్పటికప్పుడు టెన్షన్ తగ్గాలంటే!

ఒకప్పుడు రైళ్లు గంటకి పది మైళ్ల వేగంతో పరుగులు పెట్టేవి. ఇప్పుడో! గంటకి వంద మైళ్ల వేగం కూడా తక్కువగానే అనిపిస్తోంది. జీవితమూ అంతే... ఒకప్పుడు నిదానంగా సాగిన మన జీవితాలు ఇప్పుడు కుబుసాలు కదిలిపోయేంత వేగంగా పరుగులు పెడుతున్నాయి. ఇంత వేగంలో ఒత్తిడి కూడా సహజమే. మరి ఆ ఒత్తిడిని చిటికెలో తప్పించేందుకు కొన్ని చిట్కాలు ఇవిగో...

 

- ఒత్తిడితో కూడిన మనసు మీద శబ్దం చూపే ప్రభావం అపారం. మీకు ఇష్టమైన పాటని హమ్ చేయడమో, ప్రకృతిని తలపించే శబ్దాలను వినడమో (ఉదా॥ కెరటాలు) చేస్తే ఒత్తిడి తేలిపోతుంది. గది మధ్యలో చైనీస్ చిరుగంటలని తగిలించి, వాటి మీద మనసుని లగ్నం చేయడం కూడా కొందరికి ఉపశమనంగా ఉంటుంది.

 

- కాసేపు అలా వాహ్యాళికి వెళ్లడం వల్ల కూడా మనసులోని ఒత్తిడి నిదానంగా కరిగిపోతుంది. ఒత్తిడిని కలిగించే ఆలోచనలను పక్కన పెట్టి, శ్వాస మీద దృష్టిపెడుతూ నడకని సాగిస్తుంటే ఒత్తిడి ఇట్టే మాయమవుతుంది. సమస్య గురించి కాకుండా దానికి పరిష్కారాల గురించీ, జీవితంలో అంతకంటే విలువైన విషయాల గురించీ ఆలోచించే అవకాశం దక్కుతుంది.

 

- ఒత్తిడిగా అనిపించినప్పుడు లేచి నిల్చోవాలి. తల, వెన్ను, భుజాలని నిటారుగా ఉంచుకొని నిదానంగా, దీర్ఘంగా ఊపిరి పీల్చుకోవాలి. బయటకి వదిలే ప్రతి ఊపిరితోనూ మీలోని ఉద్వేగం తగ్గిపోతున్నట్లుగానూ, లోపలకి తీసుకునే ప్రతి శ్వాసతోనూ మనసు తేలికపడుతున్నట్లు భావించాలి.

 

- ఓ అందమైన దృశ్యం లేదా సాంత్వన కలిగించే చిత్రాన్ని కాసేపు గమనించండి. కిటికీలోంచి బయట ప్రకృతిలోకి చూడటమో, మీకు ఇష్టమైన రంగులో ఉన్న వస్తువుని పరిశీలించడమో చేయవచ్చు. ఏదీ కుదరకపోతే కళ్లు మూసుకుని ఓ అందమైన ప్రకృతి దృశ్యాన్ని (ఉదా॥ జలపాతం) ఊహించుకోండి.

 

- ఉద్వేగం ఓ విషవలయం. ఉద్వేగంతో మన కండరాలన్నీ బిగుసుకుంటాయి. బిగుసుకుపోయిన కండరాలు మరింత ఉద్వేగానికి దారితీస్తాయి. కాబట్టి మనసు ఉద్వేగంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం మన మొహంలో కనిపించకుండా జాగ్రత్త పడాలి. అందుకోసం ఒక్కసారి మన శరీరం మీద ధ్యాస ఉంచాలి. నుదురు, పిడికిళ్లు బిగదీసి లేకుండా చూసుకోవాలి.

 

- ఉద్వేగాన్ని ఎదుర్కొనేందుకు నవ్వుని మించిన దివ్యౌషధం లేదు. నవ్వడం వల్ల మన శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ అనే రసాయనాల ఉత్పత్తి తగ్గి, వాటి బదులుగా ఆనందాన్ని రేకెత్తించే ఎండోమార్ఫిన్స్ అనే రసాయనాలు వెలువడతాయి. కాబట్టి మనస్ఫూర్తిగా నవ్వడమో, అలా నవ్వేందుకు ఇష్టమైన కామెడీ సన్నివేశాన్ని చూడటమో చేయవచ్చు.

 

- శబ్దమే కాదు, స్పర్శ కూడా ఉద్వేగాన్ని దూరం చేస్తుంది. మనకి ఇష్టమైన వస్తువుని పట్టుకుని ఉండటమో (ఉదా॥ టెడ్డీ బేర్), రబ్బర్ బాల్ని చేతితో నొక్కడమో, వేడి నీటితో స్నానం చేయడమో, వెచ్చటి దుప్పటిని కప్పుకోవడమో... ఉద్వేగం నుంచి తప్పకుండా దూరం చేస్తాయి.                    

- నిర్జర.