డాక్టర్ జి.సూర్యనారాయణ రాజుకి ‘తెలుగువన్’ సత్కారం
posted on May 20, 2015 12:45PM
నిమ్స్‌లో అత్యున్నత స్థాయిలో వున్న డాక్టర్ జి.సూర్యనారాయణ రాజును తెలుగువన్ 15వ వార్షికోత్సవం సందర్భంగా తెలుగువన్ ఘనంగా సత్కరించింది. వైద్యో నారాయణో హరిః అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే డాక్టర్ మన తెలుగుబిడ్డ... డాక్టర్ గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు. హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో అసోసియేట్ డీన్, సీనియర్ ప్రొఫెసర్ స్థానంలో వుండటంతోపాటు సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్‌మెంట్‌కి హెడ్‌గా కూడా విధులు నిర్వహిస్తున్న ఆయన ఎంతోమంది కేన్సర్ వ్యాధిగ్రస్తుల జీవితాలలో కాంతి నింపారు. కేన్సర్ వ్యాధి నివారణకు ఆయన చేస్తున్న కృషి అనన్య సామానమైనది. 1998 నుంచి 2014 సంవత్సరం వరకు ఆయన 1,42,692 మంది కేన్సర్ ఔట్ పేషెంట్లను ట్రీట్ చేశారు. 29,808 మంది కేన్సర్ పేషెంట్లకు సర్జరీ నిర్వహించారు. ఆయన సర్జరీ చేసిన పెషెంట్లలో దాదాపు 98 శాతం మంది పేషెంట్లు కొత్త జీవితాన్ని పొందారు. హైదరాబాద్‌లో డాక్టర్‌గా ఊపిరిసలపనంత బిజీగా వున్నప్పటికీ, తన స్వస్థలమైన ఆకివీడులో ప్రతినెల మొదటి ఆదివారం నాడు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ వుంటారు. ఆ ఒక్కరోజే ఆయన దాదాపు రెండు వందల మంది పేషెంట్లను చూస్తారు. వైద్య వృత్తిలో నిర్విరామంగా కృషి చేస్తూ వేలాదిమంది జీవితాలలో సంతోషాన్ని నింపిన డాక్టర్ జి.సూర్యనారాయణరాజు తన కెరీర్‌లో వ్యక్తిగత జీవితంలో మరిన్ని విజయాలను అందుకోవాలని ‘తెలుగువన్’ కోరుకుంటోంది. ఆయనకు చిరు సత్కారం అందించే అవకాశం లభించినందుకు సంతోషిస్తోంది.