తెలుగు కోసం తెలుగు వన్

 

మాతృభాషని నెగ్గించుకోవడం ప్రభుత్వానికో, అకాడెమీలకో పరిమితమైన లక్ష్యం కాదు. మేథావులకి చేతికి వదిలి చూస్తుండిపోయే విషయమూ కాదు! అమ్మభాషని కాపాడుకోవాలి అని ప్రతి ఒక్క వ్యక్తీ, సంస్థా తన బాధ్యతగా గుర్తించి చేరుకోవాల్సిన గమ్యం. ఆ వాస్తవం గ్రహించింది కాబట్టే తెలుగువన్ ప్రారంభం నుంచీ కూడా తెలుగుభాష పట్ల నిబద్ధతతో వ్యవహరించింది. ఎవరు కలిసి వచ్చినా రాకున్నా తన వంతుగా, తెలుగు కోసం ముందుకు నడిచే ప్రయత్నం చేసింది. ఆ దిశగా కొన్ని మైలురాళ్లు ఇవీ...

 

తెలుగువన్ సాహిత్యం   Sahityam

 

ఈ డిజిటల్ యుగంలో సాహిత్యాన్ని చదివేది ఎవరు? అన్న సందిగ్థంలో సాహిత్యాన్నే డిజిటల్ రూపంలో అందించే ప్రయత్నం చేసింది తెలుగువన్. కథలు, కవితలు, బాలసాహిత్యం, బ్లాగ్స్ వంటి అక్షరసంపదను నిరంతరాయంగా అందిస్తూ వస్తోంది. ఇవే కాకుండా గ్రంథాలయం పేరుతో తెలుగు సాహిత్యంలని అరుదైన గ్రంథాలను కంప్యూటర్లోనే చదువుకునే అవకాశం కల్పిస్తోంది. నాటి మేటి రచనలను, రచయితలను నిరంతరాయంగా పరిచయం చేసే ప్రయత్నమూ చేస్తోంది. ఇక ‘తెలుగు సాహిత్యంలో హాస్యం’ అంటూ గరికపాటి ప్రేక్షకులను అలరించినా, ‘చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు’, ‘కాశీయాత్ర,’ వంటి భక్తి ధారావాహికలను అందించినా... తెలుగు అక్షరం ఉన్నంతవరకూ సాహిత్యం నిలిచి ఉంటుందని నిరూపించే ప్రయత్నం చేస్తోంది.

 

కిడ్స్ వన్  kidsone

 

ఇప్పటి పిల్లలు పట్టుమని పది కాదు కదా నాలుగు వాక్యాలు కూడా తెలుగులో చెప్పలేని పరిస్థితి. పంటికింది రాయిలాగా పదాల మధ్య ఆంగ్లం లేకుండా మాట్లాడలేని దుస్థితి. దీనికి ఎవరినో నిందించి ఉపయోగం లేదు. ప్రపంచీకరణ ఫలాలను అందుకోవాలనే అత్యాశలో మనమే ఏర్పరుచుకున్న వాతావరణం ఇది. ఇలాంటి పిల్లలకు సులువుగా, స్పష్టంగా తెలుగు తెలిసిరావాలంటే వారి దారిలోనే నడవాలని గుర్తించింది తెలుగువన్. అందుకోసం కిడ్స్వన్ పేరుతో ఓ అనుబంధ వెబ్సైటుకి రూపకల్పన చేసింది. ఇందులో కంప్యూటర్ ద్వారానే పెద్దబాలశిక్షని నేర్చుకునే సదుపాయం కల్పించింది. తెలుగు అక్షరాలను ఆటల రూపంలో అందించింది. తెలుగు పట్ల మక్కువ ఏర్పడేలా వందలాది కథలూ, పద్యాలకు దృశ్యరూపాన్ని ఇచ్చింది. తెలుగు సంస్కృతినీ, శతకసాహిత్యాన్ని కూడా పిల్లలకు అందించేలా వీడియోలను రూపొందించింది. తరం తరువాత తరానికి తెలుగుని పరిచయం చేసే ఏ ప్రయత్నాన్నీ కిడ్స్వన్ వదులుకోలేదు.

 

టోరీ  TeluguOne Radio TORi

 

రెండు వందల దేశాలు. ఎనిమిదికోట్లకు పైగా తెలుగువారు. వీరందరి మధ్యా ఆత్మీయవారధిగా నిలిచే ప్రయత్నం తెలుగువన్ రేడియోది (TORI). తెలుగు భాష పట్ల అనురక్తి తగ్గిపోవడంతో... వారి నట్టింటి నెట్లోనే నిత్యం తెలుగుని వినిపించేందుకు మొదలైన మాధ్యమం ఇది. సాధారణ ఎఫ్.ఎమ్ రేడియోలకి భిన్నంగా స్వచ్ఛమైన తెలుగులో స్వరాలు వినిపించే ప్రయత్నం టోరీది. సాహిత్యం దగ్గర నుంచీ సైనికుల భావాల వరకూ ప్రతి ఒక్క రంగాన్నీ స్పృశించే యత్నం టోరీది. అందుకనే భారతదేశంలోనే తొలి పది ఇంటర్నెట్ రేడియోలలో ఒకటిగా టోరీ నిలుస్తోంది. ఏ దేశమేగినా తెలుగు పదం వినిపించే అవకాశం కల్పిస్తోంది.                    

- నిర్జర.