పిల్లలు టీవీ చూస్తే ఫర్వాలేదా!

 

ఒక రెండు దశాబ్దాల క్రితం మన ఇళ్లలో టీవీ పాత్ర చాలా తక్కువగా ఉండేది. అప్పట్లో టీవీ అంటే దూరదర్శనే. కానీ ఇప్పుడో! వందలకొద్దీ ఛానెల్స్‌ వచ్చేసాయి. రోజంతా చూసినా తనివితీరనన్ని కార్యక్రమాలు వాటిలో ప్రసారంఅవుతున్నాయి. అందుకనే ఇప్పుడు టీవీ మన జీవితాలని శాసించేంత స్థాయికి చేరుకుంది. పెద్దవారంటే తమ విచక్షణని అనుసరించి టీవీ చూస్తారు. కానీ అభం శుభం తెలియని పిల్లల సంగతో! అందుకే వారి విషయంలో టీవీ ప్రభావాన్ని తగ్గించేందుకు మనం గట్టి ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది.

 

కారణం

ఏదో ఒక ఛానల్లో ఏదో ఒక కార్యక్రమం వస్తూ ఉండటమో, పిల్లలని ఆడించేంత ఓపిక పెద్దవారికి లేకపోవడమో, తల్లిందండ్రులిద్దరూ ఉద్యోగ బాధ్యతలలో మునిగిపోవడమో... ఇలా కారణం ఏదైతేనేం పిల్లలు టీవీలకు అతుక్కుపోతున్నారు. నిజానికి రెండేళ్లలోపు పిల్లలు అసలు టీవీ జోలికే పోకూడదనీ, రెండేళ్లు దాటిన పిల్లలు రెండుగంటలకు మించి టీవీ చూడకూడదనీ నిపుణులు సూచిస్తున్నారు. అది వారిలో అనారోగ్య సమస్యలని సృష్టించడమే కాకుండా శారీరిక, మానసిక ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
ఇవీ సమస్యలు!

 

 

- నిరంతరం టీవీ ముందు కూర్చునే పిల్లలు తమకు తెలియకుండానే ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఇలా కదలకుండా మెదలకుండా పై నుంచి ఏదో చిరుతిండిని ఆరగిస్తూ ఉండటం వల్ల వారు ఊబకాయం బారిన పడతారు.

 

- టీవీలో పాత్రలని అనుసరించడం వల్ల వారిలో హింసాత్మక ధోరణులు పెరిగే ప్రమాదం ఉంది. ఆఖరికి టామ్ అండ్‌ జెర్రీలోని పిల్లీ, ఎలుకా కొట్టుకునే సన్నివేశాలు కూడా వారి మీద ప్రతికూల ప్రభావం చూపుతాయి.

 

- తాము టీవీలో చూస్తున్నదానిలో ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ వారికి ఉండదు. సిగిరెట్లు తాగడం, బాణాలు వేసుకోవడం, గోడ మీద నుంచి దూకడం, అత్యాచారం చేయడం వంటి పనులలో ఉండే నైతికతనీ, ప్రమాదాన్నీ బేరీజు వేసుకోకుండానే వాటిని అనుసరించే ప్రమాదం ఉంది.

 

- టీవీ ప్రకటనలు పిల్లల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. పనికిమాలిన చిరుతిళ్లను ఆకర్షణీయంగా, ఉపయోగం లేని వస్తువులను అవసరంగా చిత్రీకరించి పిల్లలను ఆకర్షిస్తాయి. పిల్లలు అలాంటి వస్తువులను కొనాలని మారం చేయడం, వాటికి అలవాటుపడిపోవడం మనం తరచూ చూసేదే!

 

 

ఇవీ పరిష్కరాలు!

- పిల్లలలో ఆసక్తినీ, విజ్ఞానాన్నీ పెంచేలా ఏదన్నా వ్యాపకాన్ని అలవాటు చేసే ప్రయత్నం చేయడం.

 

- పిల్లలు మనల్ని అనుసరిస్తారు కాబట్టి వారి ముందు అనవసరంగా టీవీ చూస్తూనో, అభ్యంతరకరమైన కార్యక్రమాలు చూస్తూనో కాలం గడపకూడదు. అలా పిల్లలకి ఒక మంచి ఉదాహరణగా మనమే నిలవాల్సి ఉంటుంది.

 

- పిల్లలు తరచూ ఎలాంటి కార్యక్రమాలు చూస్తున్నారు. అవి వారి వయసుకి, ఆలోచనకీ తగినవా కాదా అని గమనించుకోవడం.

 

- పిల్లలు టీవీకి తగినంత దూరంగా కూర్చుంటున్నారా, మధ్యమధ్యలో తగినంత విరామం ఇస్తున్నారా అన్న విషయాలను గుర్తించాలి.

 

- రోజు మొత్తంలో ఇంతసేపు మాత్రమే టీవీ చూడాలి అన్న నిబంధనను వారికి స్పష్టం చేయడంతో వారు ఆ కాస్త సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాలి.

 

- హోంవర్కు చేసిన తరువాతనే, అన్నం తిన్న తరువాతనే... వంటి మాటలతో టీవీ వారి దినచర్యని అడ్డుకోకుండా చూడాలి.

 

- పిల్లవాడికి టీవీ ఒక వ్యసనంగా మారిపోతే ఆ పరిస్థితిని తేలికగా తీసుకోకూడదు. అతిగా టీవీ చూడటం వల్ల వచ్చే అనర్థాలను వివరించి....  నయానో భయానో అతని అలవాటు అదుపులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి.

 

టీవీ ఒక తప్పించుకోలేని సౌకర్యం. అలవాటు కనుక అదుపులో ఉంటే పిల్లల వినోదానికీ, విజ్ఞానానికీ, లోకజ్ఞానానికీ... టీవీని మించిన చవకబారు సాధనం కనిపించదు. లేకపోతే మాత్రం వారి జీవితాంతం వేధించే దుష్ఫ్రభావాలు తప్పవు. ఫలితం ఎలా ఉండాలన్నది మన చేతుల్లోనే ఉంది!

 

- నిర్జర.