నీరు నీరు నీరు... ఎండిపోతోంది

 

ఖైదీ నెంబర్‌ 150లో నీటి గురించి ఆ పాట గుర్తుండే ఉంటుంది. భూగర్భజలాలను రక్షించుకోవడానికి ఓ నాయకుడు చేసే పోరాటం ఆ సినిమాకి బాక్సాఫీసు దగ్గర కాసులు కురిపించింది. కానీ రోజువారీ జీవితంలో భూగర్భజలాలను రక్షించుకునేందుకు ఏ నాయకుడూ సిద్ధంగా ఉన్నట్లు లేదు. ఫలితంగా మన జీవితాలే అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నమ్మడం లేదు కదూ! నమ్మక తప్పదు మరి!!!

జాతీయ ప్రణాళికా సంస్థ నీతి ఆయోగ్‌ ‘కాంపోజిట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండెక్స్‌’ పేరుతో ఓ నివేదికను రూపొందించింది. పలు సంస్థలు చేసిన సర్వేల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. పైకి సాధారణంగా కనిపించే ఈ నివేదిక తెరిచి చూసిన వాళ్లకి దిమ్మతిరిగిపోయే వాస్తవాలు కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని...

- హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ సహా దేశంలోని 21 నగరాలలో 2020 నాటికి తీవ్ర మంచినీటి ఎద్దడి రానుంది.

- దేశవ్యాప్తంగా దాదాపు 70 శాతం నీరు కలుషితం అయిపోయింది. 122 దేశాలలోని నీటి నాణ్యతని పరిశీలిస్తే... అందులో మన దేశానికి 120వ ర్యాంకు వచ్చింది.

- దేశంలో దాదాపు 60 కోట్ల మంది ప్రజలు, తాగేందుకు సురక్షితమైన నీరు లేక అల్లల్లాడిపోతున్నారు.

- 2030 నాటికి మన దగ్గర దొరికే నీరు కంటే కొనుక్కోవల్సిన నీరే అధికంగా ఉండే ప్రమాదం ఉంది. దీని వల్ల జీడీపీకి 6 శాతం నష్టం వాటిల్లుతుంది.

- సురక్షితమైన మంచినీరు దొరకక ఏటా రెండు లక్షల మంది వేర్వేరు వ్యాధుల బారిన పడి చనిపోతున్నారు.

భూగర్భజలాలు ఎండిపోతున్నాయో అని ఏటా ఎవరో ఒక నిపుణుడు మొత్తుకుంటూనే ఉన్నారు. వాటిని పరిరక్షిస్తున్నాం అంటూ రాష్ట్రాలు కబుర్లు చెబుతూనే ఉన్నాయి. కానీ వాస్తవాలు ఇవిగో పైన చెప్పుకొన్నట్లే ఉన్నాయి. అందుకే దాదాపు 60 శాతం రాష్ట్రాలు భూగర్భ జాలాలని పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని నీతిఆయోగ్‌ నివేదిక ఎత్తిచూపించింది. వీటిలో తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలు ఉండటం గమనార్హం. దీనిబట్టి మిషన్‌ కాకతీయ వంటి ప్రతిష్ట్రత్మక ప్రాజెక్టులు ఇంకా సత్ఫలితాలు ఇవ్వలేదని అర్థమవుతోంది. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్‌, హర్యాణా, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో అయితే భూగర్భ జలాల పరిరక్షణ మరీ దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నట్లు నివేదిక చెబుతోంది.

అందుబాటులో ఉన్న నీటి వనరులను సరిగా వినియోగించుకోకపోవడం; నీళ్ల రీసైక్లింగ్‌ మీద ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ తగిన శ్రద్ధ లేకపోవడం; వందల అడుగుల లోతుకి వేసే బోర్ల మీద కూడా ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణా లేకపోవడం; వరద నీటిని సక్రమంగా వినియోగించుకోకపోవడం... వినేందుకు కాస్త బోర్‌ కొడుతుందే కానీ, భూగర్భజలాలను పరిరక్షించుకునేందుకు చాలా మార్గాలే ఉన్నాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు వీటి మీద పూర్తి అవగాహన ఉండి ఉండాలి. కానీ ప్రస్తుత నివేదిక చూస్తే మాత్రం అందుకు విరుద్ధమైన అభిప్రాయం కలుగుతోంది. ఫలితం! నివేదికలో పేర్కొన్న భయాలు 2030 నాటికి నిజమయ్యే ప్రమాదం ఉంది.