ఏదో సామెత చెప్పినట్టు...!

 

 

 

వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి.. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలుగుజాతిని విడదీయడానికి తెలుగు సామెతలనే అనుసరిస్తోంది. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్టుగా సీమాంధ్ర, తెలంగాణ పిట్టల పోరులోకి కేంద్ర ప్రభుత్వం పిల్లిలా దూరి రెండు పిట్టల్నీ స్వాహా చేయాలని చూస్తోంది. తనది కాకపోతే ఊరంతా దేకమన్నట్టు, కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు రెండు ప్రాంతాలకూ ఇబ్బంది కలిగే ప్రతిపాదనల్ని రోజుకొకటి బయటపెడుతోంది. అత్తలేని కోడలు ఉత్తమురాలన్నట్టు సోనియాగాంధీ తన అత్త ఇందిరాగాంధీ చెప్పినమాట వినకుండా రాష్ట్ర విభజనకు ప్రయత్నిస్తోంది.

 

కాంగ్రెస్ పార్టీ అనవసరంగా విభజన తేనెతుట్టె కదిలించి ముందుకు పోతే గొయ్యి వెనకకి పోతే నుయ్యి అనే పరిస్థితికొచ్చింది. అయినా నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు అడ్డగోలు విభజనకు ఆత్రంగా ప్రయత్నిస్తోంది. ఆలూ లేదూ చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు తెలంగాణ వచ్చేసినట్టు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు, రాహుల్ గాంధీ ప్రధాని అయిపోయినట్టు కలలు కంటోంది. తాంబూలాలిచ్చేశాం తన్నుకుచావండన్నట్టు ప్రస్తుతం మేం రాష్ట్రాన్ని విభజించేస్తాం. ఆ తర్వాత సమస్యలన్నీ మీరూ మీరూ కూర్చుని పరిష్కరించుకోండని అంటోంది.




రాష్ట్రాన్ని విభజించొద్దు మహాప్రభో అని సమైక్యవాదులు ఎంత మొత్తుకున్నా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అవుతోంది. ఆరే దీపానికి వెలుగు ఎక్కువన్నట్టు, చేతకానమ్మకి చేష్టలెక్కువన్నట్టు అవసానదశలో వున్న యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు తహతహలాడుతోంది. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా రాష్ట్ర విభజన చేస్తుంటే సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు నిమ్మకు నీరెత్తినట్టు, ఎవరికివారే యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. పోరునష్టం పొందులాభం అనే సామెతని మరచిపోయిన విభజనవాదులు నేను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళన్నట్టు వ్యవహరిస్తున్నారు. అగడ్తలో పడ్డ పిల్లి అదే వైకుంఠమన్నట్టు మాట్లాడుతున్నారు. దూరపుకొండలు నునుపని భ్రమపడుతున్నారు. ఏది ఏమైనా చెడపకురా చెడేవు అనే సామెతకి అర్థం కాంగ్రెస్ పార్టీ త్వరలోనే తెలుసుకుంటుంది. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టు తెలుగుజాతి యూపీఏ ప్రభుత్వాన్ని చెప్పుదెబ్బ కొట్టేరోజులు దగ్గర్లోనే వున్నాయి.